ప్రేమ వ్యవహారంలో రౌడీ మూకలతో దాడి చేయించగా గాయపడిన చటాకాయి గ్రామ పెద్దలు (ఫైల్)
నిలదీసిన సర్పంచులపై మూకుమ్మడి దాడులతో బీభత్సం
విభజించు.. పాలించు విధానం అమలు
లంక గ్రామాల్లో కట్టుబాట్లకు చెల్లుచీటి..
వారిలో వారికే విభేదాలు సృష్టించి పైశాచికానందం
సాక్షి, టాస్క్ ఫోర్స్: ప్రకృతి అందాలకు నెలవైన కొల్లేరులో కూటమి రాక్షస రాజ్యం సాగుతోంది. పెద్దల కట్టుబాట్లతో ఆచార సంప్రదాయాలు పాటిస్తూ ప్రశాంత జీవనం సాగిస్తున్న లంక గ్రామాల్లో కూటమి నేతలు చిచ్చురేపుతున్నారు. విభజించు పాలించు సిద్ధాంతంతో కూటమి మూకలు పెట్రేగిపోతున్నాయి. ప్రశ్నించిన సర్పంచులపై మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నాయి. గతంలో ఎన్నికల సమయంలోనే ఇక్కడ రాజకీయాలు ఉండేవి. ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి ఐక్యంగా జీవనం సాగించేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఎన్నికల్లో ఇచి్చన హామీలను అమలు చేయాలని నిలదీసినవారిపై రౌడీమూకలతో దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతోంది. అక్రమ పోలీసు కేసులతో భీతావహ వాతావరణం సృష్టిస్తూ పైశాచికానందం పొందుతోంది.
3.20 లక్షల మంది జనాభా
వేంగి–చాళుక్యుల పాలన నుంచి కొల్లేరు ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. పూర్వపు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 44 దిబ్బలను కొల్లేరు ప్రాంతంగా పరిగణించారు. ఇక్కడి ప్రజలు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆరాధిస్తారు. జిల్లాల పునరి్వభజన తర్వాత ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 9 మండలాల్లో 122 గ్రామాల్లో కొల్లేరు ప్రాంతం విస్తరించి ఉంది. ఏలూరు, కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో 80 వేల కుటుంబాలతో సుమారు 3.20 లక్షల మంది జనాభా ఉన్నారు. కొల్లేరు అభయారణ్యాన్ని 77,138 ఎకరాలుగా నిర్ధారించారు.
కొల్లేరు కట్టుబాట్లకు తూట్లు..
కొల్లేరు గ్రామాల్లో ప్రభుత్వానికి సమాంతరంగా ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. గ్రామ జనాభాను బట్టి బంటాలుగా విభజిస్తారు. ఒక్కో బంటాలో 100 నుంచి 50 మంది సభ్యులు ఉండవచ్చు. బంటాకు ఒక లీడర్ ఉంటాడు. గ్రామంలో అన్ని బంటాలకూ కలిపి పెద్ద వడ్డీ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తాడు. ఇతనికి అనుబంధంగా క్యాషియర్, గుమాస్తా, బంట్రోతులు ఉంటారు. కొల్లేరు చేపల చెరువుల పాటల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామావసరాలు, పెద్ద వడ్డీ, సిబ్బంది జీతాలకు ఉపయోగిస్తారు. పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు ఉన్నప్పటికీ పెద్ద వడ్డీ నిర్ణయానికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే పోలీస్‌స్టేషన్ల వరకు వెళ్లకుండా రూ.1,000 నుంచి రూ.50 వేల వరకు నగదును తప్పుగా కట్టాల్సి వస్తుంది.
సైదు గంగరాజు స్ఫూర్తి ఇదేనా..
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొల్లేరు పేరు చెప్పగానే పూర్వం ఠక్కున గుర్తుకొచ్చే పేరు దివంగత సైదు గంగరాజు. కొల్లేరు వడ్డీ సామాజికవర్గానికి చెందిన ఆయన అందరూ ఐకమత్యంగా ఉంటూ అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు. నేడు ఆయన ఆశయానికి కూటమి సర్కారు తూట్లు పొడుస్తోంది. ఐక్యతకు మారుపేరైన గ్రామాల్లో రక్తపుటేరులు పారిస్తోంది. హామీలపై ప్రశ్నిస్తే గ్రామస్తులనే పావులుగా చేసుకుని సొంత మనుషులపైనే మూకుమ్మడిగా దాడులు చేయిస్తోంది. పోలీసు స్టేషన్లలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేలా విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటోంది. కేవలం కొల్లేరు అభయారణ్య చెరువుల పేరుతో సాగుతున్న మైండ్ గేమ్‌లో కొల్లేరు అమాయక బిడ్డలు బలవుతున్నారు.
కూటమి పాలనలో కొల్లేరులో జరిగిన దురాగతాలు ఇవీ..
⇒ గత నెలలో ఎన్నికల హామీలపై ప్రశ్నిస్తూ, సోషల్‌మీడియాలో పోస్టు పెట్టినందుకు నత్తగుళ్లపాడు సర్పంచ్ ముంగర రామకృష్ణరాజుపై మూకుమ్మడి దాడి జరిగింది. రౌడీ మూకలు ఇల్లు ధ్వంసం చేశారు. తిరిగి సర్పంచ్‌పైనే పోలీసులు కేసు నమోదు చేశారు.
⇒ 2025 మేలో రాజకీయ నాయకుల మాటలు విని కొందరు మహిళలు చటాకాయి సర్పంచ్ ఘంటసాల శేషారావుపై కమ్యూనిటీ హాలు వద్ద దాడి చేశారు. దీంతో కొద్ది రోజులకే మనస్తాపంతో సర్పంచ్ మృతి చెందారు.
⇒ 2025 జూలైలో కొల్లేరు గ్రామ పరిధిలోని రాజుల కొట్టాడలో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్నారని సర్పంచ్ కొల్లాటి పద్మావతి, శ్రీనుల కుమారుడు, బంధువులపై ఇదే గ్రామంలో కూటమి నేతలు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
⇒ 2025 ఆగస్టులో నత్తగుళ్లపాడు యువతిని చటాకాయి యువకుడు ప్రేమించి తీసుకెళ్లాడు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. వారిద్దరినీ తీసుకొస్తుండగా శ్రీపర్రు వద్ద కారు ఆపి నత్తగుళ్లపాడు చెందిన వ్యక్తులు ఇతరులతో కలసి చటాకాయిలో ముగ్గురు పెద్దలపై దాడి చేశారు.
పనికిమాలిన రాజకీయాలు వద్దు
పనికిమాలిన రాజకీయాలను పక్కన పెట్టి కష్టాల్లో ఉన్న కొల్లేరు ప్రజల సంక్షేమం కోసం కృషి చేయండి. నత్తగుళ్ళపాడు సర్పంచ్‌పై దాడి దురదృష్టకరం. కట్టుబాట్ల గ్రామం అనే నానుడికి ఇటువంటివి మచ్చ. కొల్లేరు నాయకులు కళ్ళు తెరవాలి. పూర్వ వైభవాన్ని పునరుద్ధరించుకోవాలి. – చింతపల్లి వెంకటనారాయణ, కొల్లేరుపై పుస్తక రచయిత, కైకలూరు


