రాజ్యసభలో గొంతు నొక్కేశారు | YSRCP files complaint to Rajya Sabha Chairman over discrimination | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో గొంతు నొక్కేశారు

Apr 4 2026 5:29 AM | Updated on Apr 4 2026 5:29 AM

YSRCP files complaint to Rajya Sabha Chairman over discrimination

పెద్దల సభలో వైఎస్సార్‌సీపీ పట్ల తీవ్ర పక్షపాతం  

ఏడుగురు సభ్యులున్న మాకు 5 నిమిషాలు.. ఇద్దరున్న టీడీపీకి 15 నిమిషాలా? 

అమరావతిలో ప్రజాధనం లూటీ చేస్తున్నారు  

నిర్మాణాల పేరుతో నిలువు దోపిడీ.. చదరపు అడుగుకు రూ.14 వేలు ఖర్చా? 

రాజధాని రైతులు 29 వేల మందికి న్యాయం జరిగేలా బిల్లులో పెట్టాలి 

కెమెరా ఫోకస్‌లతో పబ్లిసిటీ స్టంట్లు.. దీనిపై విచారణ జరగాలి 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి  

వివక్షపై రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు.. 

అనంతరం మీడియా సమావేశంలో వివరాల వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026పై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందని, ఉద్దేశపూర్వకంగానే తమకు తక్కువ సమయం కేటాయించారని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.ఆచరణ సాధ్యం కాని రీతిలో ప్రజలకు భ్రమలు కల్పిస్తూ సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నందున అక్కడ జరుగుతున్న అవినీతిని, లోపభూయిష్టమైన బిల్లును మాత్రమే వ్యతిరేకిస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. 

రాజ్యసభలో జరిగిన పక్షపాత వైఖరిపై ఆయన పార్టీ లోక్‌సభాపక్ష నేత, ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి, ఎంపీలు డాక్టర్‌ మద్దిల గురుమూర్తి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, గొల్ల బాబూరావుతో కలిసి ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ రాధాకృష్ణన్‌కు  లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ చైర్మన్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను వివరించారు. సభలో జరిగిన వివక్ష, అమరావతి నిర్మాణంలో జరుగుతున్న ప్రజాధనం లూటీని తీవ్రస్థాయిలో ఎండగట్టారు.  

సమయం కేటాయింపులో పక్షపాతం  
రాజ్యసభలో వైఎస్సార్‌సీపీకి ఏడుగురు సభ్యులు ఉంటే.. చర్చలో పాల్గొనేందుకు కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇచ్చి మైక్‌ కట్‌ చేశారని చెప్పారు. సభలో పార్టీల బలాన్ని బట్టి కాకుండా పక్షపాత ధోరణితో సమయం కేటాయించారన్నారు. వాస్తవానికి తమ బలానికి 20 నిమిషాల సమయం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. అదే సమయంలో సభలో కేవలం ఇద్దరు సభ్యులున్న టీడీపీకి ఏకంగా 15 నిమిషాలకు పైగా మాట్లాడే అవకాశం కల్పించారని తెలిపారు. 

తమకన్నా చిన్న పార్టీలైన టీడీపీ, బీఆర్‌ఎస్‌లకు ఎక్కువ సమయం ఇచ్చారని, బీఆర్‌ఎస్‌ ఎంపీలకు ఒక్కొక్కరికి 10 నిమిషాల సమయం దక్కిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన బిల్లుపై ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం రాష్ట్ర ప్రజల గొంతు నొక్కడమేనని విమర్శించారు. సమయం కేటాయింపులో ప్రదర్శించిన పక్షపాత ధోరణి పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాజ్యసభ చైర్మన్‌ స్థానానికి ఇది తగదని పేర్కొన్నారు.  

అడుగుల లెక్కన ప్రజాధనం లూటీ  
చంద్రబాబు భ్రమలు కల్పించడాన్ని తప్పుపడుతూ ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నామని మరోసారి చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం 29 వేల మంది రైతుల నుంచి 50 వేల ఎకరాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ముందుగా ఆ రైతులకు ఎలా న్యాయం చేస్తారో బిల్లులో పొందుపరచాలని డిమాండ్‌ చేశారు. అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి, దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. 

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చదరపు అడుగు నిర్మాణానికి రూ.14 వేలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారని, ఇదంతా ప్రజాధనాన్ని లూటీ చేయడమేనని విమర్శించారు. కోల్‌కతా వంటి మహానగరమే 50 వేల ఎకరాల్లో విస్తరించి ఉందని,  చెన్నై, బెంగళూరు వంటి నగరాలు ఎన్నివేల ఎకరాల్లో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు.  

పూర్తి ప్రసంగ పాఠాన్ని రికార్డుల్లోకి తీసుకోవాలి  
రాజ్యసభలో చర్చ సందర్భంగా తమకు తగినంత సమయం ఇవ్వనందున, అడ్డుకోవడం వల్ల సభలో చదవలేకపోయిన తమ పూర్తి ప్రసంగ పాఠాన్ని సభ రికార్డుల్లో (టేబుల్‌పై) ఉంచేందుకు అనుమతించాలని కోరారు. తాము చెప్పిన అంశాలను ఉపరాష్ట్రపతి సానుకూలంగా విన్నారని, తాము ఎక్కడ నుంచి మాట్లాడటం ఆపేశామో.. అక్కడ నుంచి తమ ప్రసంగాన్ని రికార్డుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం తాము చేసిన ఫిర్యాదుపై సభలో మాట్లాడేందుకు అవకాశమిస్తామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు. కెమెరా ప్రొసీడింగ్స్, అమరావతి అవినీతిపై త్వరలో జరిగే సమావేశాల్లో మరోసారి గట్టిగా నిలదీస్తామని చెప్పారు.  

ఆ కెమెరా ఫోకస్‌లపై విచారణ జరగాలి 
సభా కార్యకలాపాలు ముగుస్తున్న సమయంలో సందర్శకుల గ్యాలరీలో ఉన్న టీడీపీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులపైకి పదేపదే కెమెరా ఫోకస్‌ వెళ్లడం యాదృచ్ఛికం కాదని వైవీ సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇది ముందుగా ప్లాన్‌ చేసుకున్నట్లు ఉందని, ఆ ఫొటోలను పత్రికల్లో వేసుకుని ప్రచారం చేసుకున్నారని ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ కెమెరా ఫోకస్‌ వ్యవహారంపై అధికారిక విచారణ జరపాలని చైర్మన్‌ను కోరినట్లు చెప్పారు. 

సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిన సమయం కేటాయింపు వెనుక ఉన్న పరిస్థితులపై కూడా విచారణకు ఆదేశించాలని సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. సమాఖ్య స్ఫూర్తిని, రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన పెద్దల సభలో ఇలాంటి పరిణామాలు సభ నిర్వహణపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్యాలరీ ఫొటోల దురి్వనియోగానికి సంబంధించిన పత్రికా క్లిప్పింగ్, తన ప్రసంగపాఠం కాపీలను చైర్మన్‌కు ఇచ్చిన ఫిర్యాదుకు జత చేశారు.  

కాగ్‌ ఆడిట్‌ చేయాలి.. సుప్రీంకోర్టు విచారణ చేపట్టాలి: గొల్ల బాబూరావు డిమాండ్‌ 
వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడుతూ... రాజధాని ఏర్పాటు అనేది తమ పరిధిలో లేదని గతంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు రాతపూర్వకంగా తెలిపిందని గుర్తు చేశారు. ఆ విషయాన్ని విస్మరించిన సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం అమరావతికి చట్టం చేసేందుకు పూనుకున్నారని మండిపడ్డారు. 2014 నుంచి చట్టం చేయాలని గుర్తు రాలేదా అంటూ చంద్రబాబును నిలదీశారు. అప్పుడు అమరావతిపై లేని ప్రేమ ఇప్పుడెందుకు సడెన్‌గా వచ్చిందంటూ ప్రశ్నించారు. 

పేదల నుంచి ఐదువేల ఎకరాల అసైన్డ్‌ భూములను తీసుకున్నారని, వారికి తిరిగి ఏం ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ పేదలకు ఐదు శాతం ల్యాండ్‌ పంపిణీ చేయాలని అమరావతి యాక్ట్‌లో ఉందని చెప్పారు. ప్రస్తుతం వారికి ఎందుకు పంపిణీ చేయడం లేదో చెప్పాలని కోరారు. అమరావతిని బూచిగా చూపించి మిగతా ప్రాంతాలను పట్టించుకోకపోవడం అత్యంత దారుణమన్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ భారీ అవినీతిపై కాగ్‌ ఆడిట్‌ చేయాలని, దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement