దళితుడిపై అయ్యన్న దాడి | Assembly Speaker slaps Dalit elderly man who was beating drums | Sakshi
Sakshi News home page

దళితుడిపై అయ్యన్న దాడి

Apr 4 2026 5:10 AM | Updated on Apr 4 2026 10:07 AM

Assembly Speaker slaps Dalit elderly man who was beating drums

డప్పు కొడుతున్న దళిత వృద్ధుడి చెంపపై కొట్టిన అసెంబ్లీ స్పీకర్‌.. నర్సీపట్నంలోని మరిడి అమ్మవారి జాతరలో ఘటన 

సోషల్‌ మీడియాలో వీడియో హల్‌చల్‌  

అయ్యన్నపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల డిమాండ్‌ 

సాక్షి, అనకాపల్లి/మునగపాక: డప్పు కొడుతున్న దళితుడిపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి జిల్లా  నర్సీపట్నంలో నాలుగు రోజుల క్రితం జరిగిన మరిడిమాంబ అమ్మవారి జాతరలో 60 ఏళ్లు పైబడి ఉన్న దళిత డప్పు కళాకారుడుపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చేయి చేసుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నర్సీపట్నానికి చెందిన దళిత డప్పు కళాకారుడు నాగులపల్లి రామదాసు తోటి కళాకారులతో కలిసి పండగలో డప్పు కొడుతుండగా..ఒక్కసారిగా అయ్యన్న ఆగ్రహంతో ఊగిపోయారు. 

వృద్ధుడు అని కూడా చూడకుండా రామదాసుపై చేయి చేసుకున్నారు. చెంప చెళ్లుమనిపించడమే కాకుండా పరుష పదజాలంతో తీవ్రంగా దూషించారు.  ఆ సమయంలో సీఐ గఫూర్‌తో పాటు ఎస్‌ఐలు అక్కడే ఉన్నా ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. ఇదిలా ఉండగా తన కాలు తొక్కినందుకే అయ్యన్న కొట్టా­డని బాధితుడితో బలవంతంగా చెప్పించడం కొసమెరుపు.

స్పీకర్‌ అయ్యన్నను అరెస్టు చేయాలి: కేవీపీఎస్‌ డిమాండ్‌
సాక్షి, అమరావతి: దళిత డప్పు కళాకారుడిపై దాడి చేసిన అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్‌ చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) అధ్యక్షుడు ఓ.నల్లప్ప, ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి శుక్రవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మరిడితల్లి పండగలో డప్పు కొడుతుండగా దళితుడైన నాగులాపల్లి రామదాసును పోలీసుల సమక్షంలోనే అయ్యన్నపాత్రుడు చెంపదెబ్బ కొట్టడం దారుణమన్నారు. 

బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన స్పీకర్‌ స్థాయి వ్యక్తి విచక్షణ కోల్పోతే ఎలా? అని ప్రశ్నించారు. ఈ చర్యకు పాల్పడిన స్పీకర్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. విధి నిర్వహణలో ఉండి కూడా నివారించని పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నల్లప్ప, మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. 

అయ్యన్న క్షమాపణ చెప్పాలి 
నర్సీపట్నంలో జరిగిన మరిడిమాంబ జాతరలో దళిత వృద్ధ డప్పు కళాకారుడిని అయ్యన్న చెంప దెబ్బ కొట్టారు. తక్షణమే ఆ దళిత డప్పు కళాకారుడికి అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పాలి. కూటమి పార్టీల నాయకులకు దళితులంటే చిన్నచూపు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలి. 
– డాక్టర్‌ బూసి వెంకటరావు, విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌  

దాడి అమానుషం
డప్పు కళాకారుడిపై అయ్యన్నపాత్రుడు దాడి చేయడం అమానుషం. సమాజంలో దళితులను గౌరవించాల్సింది పోయి అగౌరవపరచడం అయ్యన్నకు తగదు. కళాకారులను ప్రోత్సహించాల్సింది పోయి దాడి చేయడం సరైన సంప్రదాయం కాదు. తక్షణమే అయ్యన్నపాత్రుడు దళితులకు క్షమాపణ చెప్పాలి.
– యల్లబిల్లి కొండబాబు, డప్పు కళాకారుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

అయ్యన్న దిష్టిబొమ్మ దహనం
కోవెలకుంట్ల: దళితుడిపై అయ్యన్నపాత్రుడు దాడి చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం రాత్రి నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో దళిత సంఘాల నేతలు నిరసన తెలి­పారు. అయ్యన్నపాత్రుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి దండు మధుబాబు, గ్రేటర్‌ రాయలసీమ మాలమహానాడు అధ్యక్షుడు కోగిల ప్రసాద్‌ మాట్లాడుతూ..దళితులపై అహంకారపూరిత వైఖరి ప్రదర్శిస్తూ దాడి చేయడం హేయమన్నారు. 

టీడీపీ పాలనలో రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోట దళితులపై దాడులు, దౌర్యన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దళితుడిపై దాడి చేసిన అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అయ్యన్నపాత్రుడిపై  చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement