మూడో రోజు కొనసాగిన నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమ్మె | Network hospitals strike continues for third day | Sakshi
Sakshi News home page

మూడో రోజు కొనసాగిన నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమ్మె

Apr 4 2026 5:16 AM | Updated on Apr 4 2026 5:16 AM

Network hospitals strike continues for third day

తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్న బాబు సర్కార్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమ్మె మూడో రోజైన శుక్రవారం నాడూ కొనసాగింది. ఆస్ప­త్రుల యాజమాన్యాలు సేవలు పూర్తిగా నిలిపివేసి నిరసన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో ఈ నెల 1వ తేదీ నుంచి నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఆస్పత్రులు సేవలు బంద్‌ చేయడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టనట్టే వ్యవహరిస్తోంది. 

తొలి రోజు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశ)తో మొక్కుబడిగా చర్చలు చేపట్టిన ప్రభుత్వం తర్వాత చేతులు దులిపేసుకుంది. చర్చలు జరిపిన రోజే సమ్మె ఆపబోమని, కొనసాగిస్తామని ఆశ తేల్చి చెప్పినా, మరోమారు వారితో చర్చలు జరపడానికి ప్రభుత్వం కనీస చొరవ చూపకపోవడం గమనార్హం.

ఓవైపు ఆరోగ్య శ్రీ సేవలు ఆగిపోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ప్రైవేట్, పార్టీ, ఇతర కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు, కేరళ ఎన్నికల ప్రచారంలో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ బిజీగా గడిపేస్తున్నారు. 1.40 కోట్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆధారమైన పథకానికి సంబంధించిన సేవలు నిలిచిపోతే కనీసం పట్టించుకునే నాథుడు కూడా లేకుండా పోయారని రోగులు మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement