రాజధాని నిర్మాణం ఒక్క రోజులో అయ్యేది కాదు | Chandrababu Naidu on Capital Amaravati | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మాణం ఒక్క రోజులో అయ్యేది కాదు

Apr 4 2026 5:24 AM | Updated on Apr 4 2026 10:03 AM

Chandrababu Naidu on Capital Amaravati

ప్రతిసారీ రాజధాని మారుస్తామంటే ఎలా?

శాశ్వత రాజధాని అని పార్లమెంటు చట్టం చేస్తే దాన్ని మార్చేస్తామంటారా? 

సీఆర్‌డీఏ నోటిఫై చేసిన ప్రాంతమంతా రాజధానే 

పశ్చిమాసియా యుద్ధం వల్ల ధరలు పెరుగుతాయి 

సీఎం చంద్రబాబునాయుడు

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం ఒక్క రోజులో పూర్తయ్యేది కాదని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇన్నర్‌ రింగ్‌ రోడ్, అవుటర్‌ రింగ్‌ రోడ్, స్పోర్ట్‌ సిటీ వంటి వేర్వేరు ప్రాజెక్టులు నిర్మితమవుతూనే ఉంటాయన్నారు. అమరావతి సెల్ఫ్‌ సస్టెయినబుల్, మోనిటైజేషన్‌ ప్రాజెక్టు అని పదే పదే చెబుతున్నామని తెలిపారు. రాజధానిలో భూమి విలువలు పెరుగుతాయని, దీనిపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని అన్నారు. 

29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల అత్యంత సారవంతమైన, ఖరీదైన భూములను ఇచ్చారని చెప్పారు. దేశానికి ఫ్యూచర్‌ సిటీ అమరావతేనని చెప్పారు. అమరావతిని భవిష్యత్తులో ఎవరూ ఏమీ చేయలేరని చెప్పారు. పార్లమెంటు శాశ్వత రాజధాని అని చట్టం చేస్తే దానిని కూడా మార్చేస్తామని మాట్లాడతారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ప్లాన్‌ ఏ, ప్లాన్‌ బీ చేస్తామని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. అప్రజాస్వామికంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు. 

సీఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతమంతా రాజధాని అవుతుందన్నారు. ప్రస్తుతం రాజధానిలో రూ.56 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని తెలిపారు. 2028 నాటికల్లా రాజధానిలో ప్రధానమైన పనులన్నీ కొలిక్కి వస్తాయన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ధరలు పెరుగుతాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement