బైక్‌ను ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు | Travel bus hits bike three dead | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

Apr 4 2026 5:19 AM | Updated on Apr 4 2026 5:19 AM

Travel bus hits bike three dead

ముగ్గురు యువకుల దుర్మరణం 

అనకాపల్లి జిల్లా పోతురెడ్డిపాలెం వద్ద ఘటన

యలమంచిలి రూరల్‌: అనకాపల్లి జిల్లా లో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. యలమంచిలి మండలం పోతురెడ్డిపాలెం కూడలి వద్ద జాతీయ రహదారిపై బైక్‌ను ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నాని (24),  ఏటికొప్పాకకు చెందిన ఇల్లపు గోవిందు (25), పోతిరెడ్డిపాలేనికి చెందిన బంగారు దుర్గాప్రసాద్‌ (16) మృత్యువాత పడ్డారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు రూరల్‌ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. పురుషోత్తపురంలో గురువారం రాత్రి గొల్లమారెమ్మ తల్లి పండగ జరిగింది. స్నేహితులైన ఇల్లపు గోవింద్, బంగారు నాని, బంగారు దుర్గాప్రసాద్‌ పండగకు వెళ్లారు. అనంతరం దుర్గాప్రసాద్‌ను పోతురెడ్డిపాలెంలో డ్రాప్‌ చేసి రావడానికి ముగ్గురూ కలిసి ఒకే బైకుపై పురుషోత్తపురం నుంచి బయలుదేరారు. 

పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద సర్వీసు రోడ్డులోకి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. రోడ్డు దాటే క్రమంలో లారీని గమనించిన యువకులు బస్సును గమనించలేదు. కేవలం రెండు సెకన్లలో రోడ్డు దాటతారనగా.. బస్సు బైకు వెనుక భాగాన్ని ఢీకొంది. బంగారు నాని ఇటీవల ఉగాది పండగకు కొత్త ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. అమ్మవారి పండగలో ఆనందంగా గడిపి  ఇంటికి వెళ్తున్న సమ­యంలో  ప్రమాదానికి గురి కావడం, ముగ్గురు యువకులూ ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. 

ప్రమాద విషయం తెలిసిన గ్రామస్తులు ప్రమాద స్థలంలో బస్సు అద్దాలను కర్రలు, రాళ్లతో ధ్వంసం చేశారు. దీంతో బస్సులో ప్రయాణికులు భయాందోళనతో సమీపంలో పొలాల్లోకి పరుగులు తీశారు. యలమంచిలి సీఐ ధనుంజయరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు యువకుల మృతితో పురుషోత్తపురం, పోతురెడ్డిపాలెం గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement