మాల్డా ఘటనలో సూత్రధారి అరెస్టు  | Mastermind Mofakkerul Islam arrested in Malda incident | Sakshi
Sakshi News home page

మాల్డా ఘటనలో సూత్రధారి అరెస్టు 

Apr 4 2026 5:27 AM | Updated on Apr 4 2026 9:13 AM

Mastermind Mofakkerul Islam arrested in Malda incident

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం మాల్డా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) విధుల్లో నిమగ్నమైన ఏడుగురు జ్యుడీషియల్‌ అధికారులను నిర్బంధించిన ఘటనలో అసలు సూత్రధారి అడ్వొకేట్‌ ముఫకరూల్‌ ఇస్లాంతోపాటు మరో వ్యక్తిని శుక్రవారం సిలిగురి బాగ్దోగ్రా ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో వలపన్ని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటిదాకా 35 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌(ఐఎస్‌ఎఫ్‌) అభ్యర్థి మౌలానా మొహమ్మద్‌ షాజహాన్‌ అలీ ఖాద్రీ కూడా ఉన్నాడు. 

మొతాబారీ అసెంబ్లీ స్థానం పరిధిలోని కాలియాచాక్‌ గ్రామంలో బుధవారం రాత్రి జ్యుడీషియల్‌ అధికారులను స్థానికులు ఘెరావ్‌ చేసి తొమ్మిది గంటలపాటు నిర్బంధించారు. అర్ధరాత్రి తర్వాత సైన్యం వారిని రక్షించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జ్యుడీషియల్‌ అధికారులను వేధించిన ఘటనపై సీబీఐ లేదా ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లాలోని ఇతాహర్‌ గ్రామానికి చెందిన ముఫకరూల్‌ ఇస్లాం ప్రస్తుతం కోల్‌కతాలో న్యాయవాదిగా పని చేస్తున్నాడు. ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ కాలియాచాక్‌లో స్థానికులను రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ముఫకరూల్‌ ఇస్లాం ప్రోద్బలంతోనే జనం జ్యుడీషియల్‌ అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు తేలింది. కాలియాచాక్‌ పోలీసు స్టేషన్‌పై అతడిపై మూడు కేసులు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement