సిలబస్‌ ‘ప్రశ్నా’ర్థకం? | Irrelevant questions in 10th class public exams | Sakshi
Sakshi News home page

సిలబస్‌ ‘ప్రశ్నా’ర్థకం?

Apr 4 2026 5:38 AM | Updated on Apr 4 2026 10:01 AM

Irrelevant questions in 10th class public exams

టెన్త్‌ పరీక్షల్లో సంబంధం లేని ప్రశ్నలు  

చంద్రబాబు పాలనలో దుస్థితి  

ఇంగ్లిష్, ఫిజిక్స్‌ పేపర్లలో మొత్తం 21 మార్కులు నష్టం.. బ్లూప్రింట్‌లో లేని విధంగా పేపర్‌ సెట్టింగ్‌పై ఆందోళన  

అదనపు మార్కులు కలపాలని విద్యార్థుల డిమాండ్‌   

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం విద్యా­ర్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ వికృత ప్రయోగాలతో విద్యాప్రమాణాలు దారుణంగా పతనమయ్యాయి. దీనికితోడు పరీక్షల వ్యవస్థను సర్కారు అపహాస్యం చేస్తోంది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల (ఎస్‌ఎస్‌సీ–2026) నిర్వహణలో తప్పటడుగులు వేసింది. ప్రశ్నలను బ్లూప్రింట్‌ ప్రకారం కాకుండా తప్పుల తడకగా, బయట సిలబస్‌ నుంచి ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం ముగిసిన చివరి పరీక్ష ఇంగ్లిష్‌ పేపర్‌లో ప్రశ్నలు అస్తవ్యస్తంగా ఉండడంతో విద్యార్థులు ఏకంగా 15 మార్కులు కోల్పోయే ప్రమాదమేర్పడింది. 

అలాగే మార్చి 25న జరిగిన ఫిజికల్‌ సైన్స్‌ పేపర్‌లోనూ తప్పు ప్రశ్నలు ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆరు మార్కులు కోల్పోతున్నారు. దీనిపై సర్వత్రా విస్మ­యం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి, బోధనేతర పనులను అప్పగించి­న విద్యాశాఖ.. గతేడాది డిసెంబర్‌ 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షల కోసం ‘100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌’ అమలు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రశ్నావళి, జవాబులను రూపొందించి వాటినే బట్టీ పట్టించింది. 

కానీ యాక్షన్‌ ప్లాన్‌ కంటెంట్‌కు భిన్నంగా ప్రశ్నపత్రం ఇచ్చి విద్యార్థులను బలి చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పేపర్‌ సెట్టింగ్‌లో 100 మార్కుల ప్రశ్నపత్రంలో ప్రశ్నల సరళి.. 35 శాతం మార్కులకు సులభంగా ప్రతి విద్యార్థీ రాసేలా, మరో 15 శాతం కష్టతరంగా, మిగిలిన 50 శాతం మధ్యస్తంగా ఉండేలా నిపుణులు చర్యలు తీసుకుంటారు. కానీ, ఈ ఏడాది ఎవరికీ అర్థంగాని రీతిలో కనీస ప్రమాణాలు పాటించకుండా పరీక్ష పేపర్లు నిర్లక్ష్యంగా రూపొందించారని ఉపాధ్యాయులే విమర్శిస్తున్నారు.  

ఇంగ్లిష్లో పేపర్లో ఇచ్చిన తప్పు ప్రశ్నలివీ..  
టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలప్రశ్నపత్రాలను పరిశీలించిన ఉపాధ్యాయులు ఇంగ్లిష్, ఫిజికల్‌ సైన్స్‌ పేపర్లు బ్లూప్రింట్‌కు భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. ఇంగ్లిష్‌ పేపర్‌ను పరిశీలిస్తే..  
» జంబుల్డ్‌ సెంటెన్స్‌ (ప్రశ్న నం.17)లో సాధారణంగా ఒక స్టోరీ లేదా ఒక ఘటనను ఇచ్చి, అందులోని కొన్ని పదాలను అటు ఇటుగా మార్చి (జంబుల్‌), ఆర్డర్‌లో పెట్టమని అడుగుతారు. కానీ ఈసారి పేపర్‌లో ఒక స్టోరీని పూర్తిగా ‘రివర్స్‌’లో వెనుక నుంచి ఇచ్చారు.  దీంతో విద్యార్థులు ఐదు మార్కులు కోల్పోయారు.  
»  ఎడిటింగ్‌ (ప్రశ్న నం.22): ఇది బ్లూ ప్రింట్‌ ప్రకారం ఇచ్చిన పాసేజ్‌లో ఎడిట్‌ చేయాల్సిన సెంటెన్స్‌ను ‘అండర్‌ లైన్‌’ చేయాలి. గతంలో జరిగిన పరీక్షల్లో ఇచ్చిన పాసేజ్‌లో నాలుగు వర్డ్స్‌ను అండర్‌లైన్‌ చేసి ఇచ్చారు. కానీ పబ్లిక్‌ పరీక్షలో మాత్రం ఒకే పాసేజ్‌ ఇచ్చి ఎక్కడ ఎడిట్‌ చేయాలో అండర్‌లైన్‌ చేయలేదు. 4 మార్కులు కోల్పోయారు. 
» అడ్వైస్‌ (ప్రశ్న నం.26): సెంటెన్స్‌లో ఇచ్చిన ‘నౌన్‌’ను ఉద్దేశించి అడ్వైస్‌ ఇస్తారు. కానీ, ఈసా­రి పరీక్షలో నౌన్‌కు కాకుండా నౌన్‌ తండ్రికి అడ్వైస్‌ ఇవ్వమని అడిగారు. అంటే విద్యార్థులకు బోధించని, సిలబస్‌లో లేని ప్రశ్నను ఇవ్వడంతో 2 మార్కులు కోల్పోయారు.  
»  ఆపోజిట్‌ వర్డ్స్‌ (ప్రశ్న నం.28): ఇది పూర్తిగా సిలబస్‌లో లేనిది, బ్లూప్రింట్‌కు సంబంధం లేనిది ఇచ్చారు. ఇది కూడా 4 మార్కుల ప్రశ్న కావడం గమనార్హం.   

ఫిజికల్‌ సైన్స్‌లోనూ అదే తీరు  
ఫిజికల్‌ సైన్స్‌ పేపర్‌లోనూ సిలబస్‌లో లేని ప్రశ్నలే ఇచ్చారు. వారి ఐక్యూ స్థాయిని అంచనా వేసేవిగా మార్చేశారు. 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌లో విద్యార్థులు కచ్చితంగా ఏరోజు ఏ ప్రశ్నలు చదవాలో సిలబస్‌ ఇచ్చా రు. కానీ ఆ జాబితాలోని మోడల్స్‌కు, వెయిటేజీకి విరుద్ధంగా ప్రశ్నలు సైతం సందిగ్ధంగా, అసాధారణ రీతిలో ఇవ్వడంతో విద్యార్థులు  సరిగా రాయలేకపోయారు. ముఖ్యంగా 8, 11, 14(1), 14(4), 3వ ప్రశ్నలు అసాధారణ రీతిలో ఇవ్వడాన్ని ఉదాహరణగా చెబుతున్నారు. వీటికి ఆరు మార్కులు  కోల్పోయే పరిస్థితి వచ్చింది.  

Advertisement
 
Advertisement
Advertisement