ఏవోబీలో వెండితెర వెలుగులు | Andhra Odisha border region has become the home of many film scenes | Sakshi
Sakshi News home page

ఏవోబీలో వెండితెర వెలుగులు

Apr 4 2026 5:47 AM | Updated on Apr 4 2026 5:47 AM

Andhra Odisha border region has become the home of many film scenes

ప్రకృతి అందాలకు నెలవుగా సరిహద్దు ప్రాంతం 

 సినిమా షూటింగ్‌లతో నిత్యం సందడి  

తరలివస్తున్న చిత్ర యూనిట్లు 

మౌలిక సదుపాయాలు కల్పి స్తే మరింత ఆదరణ 

ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతం ప్రకృతి రమణీయతకు అద్దంపడుతోంది. పర్యాటకులనే కాకుండా సినీ ప్రపంచాన్నీ ఆకర్షిస్తోంది. దీంతో ఎన్నో సినిమా సన్నివేశాలకు నిలయంగా మారింది. పలు సుందర దృశ్యాలు కెమెరాలకు చిక్కుతున్నాయి. ఈ సుందర ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే రానున్న కాలంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.

ముంచంగిపుట్టు: మన్యం.. ప్రకృతి అందాలకు పేరుగాంచింది. ఇందులోనూ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఒకవైపు దీవులను తలపించే జోలాపుట్టు అందాలు మరోవైపు పచ్చని కొండలతో నిండిన ప్రశాంత వాతావరణం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతంలోని సుందర ప్రకృతి దృశ్యాలు సినీ దర్శకులను సైతం కట్టిపడేస్తోంది. దీంతో సినిమా షూటింగ్‌లు తరచూ జరుగుతున్నాయి.  

చిత్రీకరణ జరిగే ప్రాంతాలు 
జోలాపుట్టు జలాశయం ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో సుమారు 250 పైగా గ్రామాలకు విస్తరించి ఉంది. జలాశమం మధ్యలో మట్టిదిబ్బలు అందమైన దీవులను తలపించేలా దర్శనమిస్తున్నాయి. ఇక్కడున్న మత్స్యగెడ్డ అందాలు అందరిని కట్టిపడేస్తున్నాయి. మెలికలు తిరుగుతూ ఎత్తైన గిరుల మధ్య ప్రవాహించే మత్స్యగెడ్డ అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 

ఇక్కడున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి చేరేందుకు ఏర్పాటుచేసిన వించ్‌ ప్రయాణం ఓ అద్భుతం.. ఈ ప్రయాణాన్ని కూడా సినిమాల్లో చిత్రీకరిస్తున్నారు. డుడుమ, మాచ్‌ఖండ్, మత్స్యగెడ్డ సుందర ప్రదేశాలకు వచ్చి లోకేషన్‌లు చూసిన ప్రముఖ డైరెక్టర్లు, ఫోటోగ్రాఫర్లు  కెమెరాలో బంధించి వెళ్తున్నారు.  

మౌలిక సదుపాయాలు లేక అవస్థలు 
ప్రకృతి అందాలకు నిలయంగా మారిన ఏవోబీలోని తరచూ సినిమా షూటింగ్‌లు జరుతున్నా కనీస మౌలిక సదుపాయాలు లేక సిని చిత్ర బృందం అవస్థలు పడుతున్నారు. సినిమా షూటింగ్‌లు, పర్యాటకులు పెరుగుతున్న సౌకర్యాలు కల్పన లేక ప్రభుత్వాలు విఫలమైయ్యాయి. బస చేసేందుకు కాటేజీలు, రెసిడెన్సీలు లేక పర్యాటకులు ఉండలేకపోతున్నారు. 

ఇక్కడ బస చేసేందుకు కాటేజీలు, హోటళ్లు లేకపోవడంతో సినిమా షూటింగ్‌ చేసే వారు అరకు, పాడేరు తదితర ప్రాంతాల నుంచి సుమారు 50 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ప్రాంతానికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సమయం వృథా అవుతుంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పి స్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని పలువురు చెబుతున్నారు. 

చిత్రీకరించిన సినిమాలు  
» 2021లో ‘హనుమాన్‌’ సినిమా షూటింగ్‌ జరిగింది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో హిరోగా తేజ సజ్జా, హిరోయిన్‌గా అమృత అయ్యర్‌లపై పలు పాటాలు, సన్నివేశాలను చిత్రీకరించారు. 
» 2022లో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా షూటింగ్‌కు మూడు రోజులు పాటు జరిగింది. హిరో అల్లరి నరేష్, హిరోయిన్‌ ఆనందిపై పాటను మత్స్యగెడ్డ ఒడ్డున చిత్రీకరించారు. 


»   2023లో ఏవోబీ సరిహద్దు ప్రాంతమైన వంతాల ఘాట్‌లో ‘పుష్ప–2’ సినిమాలో లారీ ఛేజింగ్‌ సన్నివేశాలను దర్శకుడు సుకుమార్‌ చిత్రీకరించారు. 
» 2024లో  మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం పరిసరాల ప్రాంతాల్లో ప్రముఖ సినీ డైరెక్టర్‌ జాగర్లమూడి రాధాక్రిష్ణ(క్రిష్) దర్శకత్వంలో ‘ఘాటీ’ సినిమా షూటింగ్‌ జరిగింది. హిరోయిన్‌ అనుష్క శెట్టి, ప్రముఖ నటుడు జగపతిబాబు, జాన్‌ విజయ్‌లపై సన్నివేశాలు, యాక్షన్‌ సీన్లు చిత్రీకరించారు. 


» 2024 సంవత్సరం అక్టోబర్‌లో ‘రాబిన్‌హుడ్‌’ చిత్రంలోని హీరో నితిన్, హీరోయిన్‌ శ్రీలీలపై కొన్ని సన్నివేశాలు షూటింగ్‌ తీశారు. 
»  2025లో సరిహద్దులోని పలు ప్రాంతాల్లో దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్‌బాబుల షూటింగ్‌ గుట్టు చప్పుడు కాకుండా జరిగింది. 

అందాలు అద్భుతం 
ఏవోబీ ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయి. డుడుమ జలపాతం, మాచ్‌ఖండ్‌ వించ్‌ హౌస్‌లో ప్రయా ణం మధుర అనుభూతి ఇస్తుంది. సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రాంతం. మొదట వారం రోజులు సినిమా షూటింగ్‌ చేస్తే చాలు అనుకున్నాను. కానీ రెండు వారాలుగా సినిమా షూటింగ్‌ జరుగుతుంది. నేను చూసిన అందమైన లొకేషన్‌లో మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం, డుడుమ జలపాతం ఒకటి. ఈ ప్రాంతం చిత్రీకరణకు బాగుంది.   – జాగర్లపూడి రాధాక్రిష్ణ  

షూటింగ్‌లకు అనువైన ప్రాంతం  
కేరళ, గోవాలలోనే సినిమా షూటింగ్‌కు మంచి లోకేషన్‌ లు ఉన్నాయని అనుకుంటారు. కాని ఆంధ్ర–ఒడిశాసరిహద్దు ప్రాంతమైన మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం పరిసర ప్రాంతాల్లో చాలా అందమైన లోకేషన్లు ఉన్నాయి. ఎతైన కొండల నడుమ మత్స్యగెడ్డ ఒంపులు తిరుగుతూ వెళ్తున్న దృశ్యం చూస్తూ చాలా ఎంజాయ్‌ చేస్తున్నాను. ఇక్కడి ప్రకృతి అందాలు బాగున్నాయి. రానున్న రోజుల్లో ఎక్కువ షూటింగ్‌లు జరిగే  అవకాశాలున్నాయి.  – జగపతిబాబు,  ప్రముఖ సినీ నటుడు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement