ప్రముఖ తెలుగు యూట్యూబర్‌ నందు కుటుంబంపై కేసు | Filing a case against Nandus World Family | Sakshi
Sakshi News home page

ప్రముఖ తెలుగు యూట్యూబర్‌ నందు కుటుంబంపై కేసు

Jun 3 2026 3:58 PM | Updated on Jun 3 2026 5:10 PM

Filing a case against Nandus World Family

సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలో ప్రముఖ యూట్యూబర్, మన శంకర వరప్రసాద్ నటి రమా నందన అలియాస్ నందు కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట యూకే వీసా రిన్యూవల్‌లో మోసం చేశారంటూ వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

యూకేలో వీసా గడువు ముగియడంతో, భారత్‌లోని బ్రాంచ్ ద్వారా వీసా ప్రాసెస్ చేస్తామని నందు కుటుంబ సభ్యులు నమ్మించడంతో, యూట్యూబ్‌లో ఉన్న ఫేమ్‌ కారణంగా వారి మాటలను విశ్వసించి రూ.15 లక్షలు చెల్లించాడు. అయితే, నెలలు గడిచినా వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గ్రహించి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు  
బాధితుడి ఫిర్యాదు మేరకు డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమా నందన, గుంటూరులో నివసించే మధుకర్ తండ్రిపై క్రైమ్ నంబర్ 515/2025 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతోందని ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ బీ. రాజు తెలిపారు.

నందూస్ వరల్డ్ యూట్యూబ్ ప్రయాణం  
నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తూ లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించిన నందన, తన భర్త మధుకర్, పిల్లలతో కలిసి సరదా వీడియోలు చేస్తూ జనాన్ని ఎంటర్‌టైన్ చేసేవారు. ఒకానొక దశలో తినడానికి తిండిలేక పస్తులున్నామని, మగ గొంతు కారణంగా పలు అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ వీడియోలు చేస్తూ వచ్చారు. ఆ వీడియోలు ప్రేక్షకాదరణ పొందాయి. యూట్యూబ్ ఆదాయంతో పాటు సినీమా అవకాశాలు కూడా దక్కాయి. నందన తన తొలి సినిమా మన శంకర వర ప్రసాద్లో హీరోయిన్ నయనతార స్నేహితురాలు పాత్రలో కనిపించారు. ఒక్క సన్నివేశమే అయినా ఆమెకు గుర్తింపు వచ్చింది. తరువాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లు సమాచారం.

ఆరోపణల్ని ఖండించిన నందన 
తనపై వస్తున్న ఆరోపణలను నందన ఖండించారు. ప్రజల్లో, సోషల్ మీడియాలో తమకు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేక పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె వీడియో విడుదల చేశారు. యూకే నుంచి భారత్‌కు వచ్చిన కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. తమకు సంబంధించిన ఏ విషయమైనా తామే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement