బాబూ.. రైతు కన్నీటితో అమరావతా? | KSR Comments Regarding The TDP's Approach To Land Acquisition From Farmers | Sakshi
Sakshi News home page

బాబూ.. రైతు కన్నీటితో అమరావతా?

Jul 20 2026 12:03 PM | Updated on Jul 20 2026 12:48 PM

KSR Comments Regarding The TDP's Approach To Land Acquisition From Farmers

ర్షకులకు, భూమికి ఉండే అవినాభావ సంబంధం మాటలకు అందనిది. ఆ భూమిని నమ్ముకుని రైతు జీవనం సాగిస్తాడు. పంటలు వేసుకుని పసిపిల్లాడిని సాకుతున్నట్లుగా చూసుకుంటాడు. అలాంటి పంటపొలం నాశనం అవుతుంటే విలవిలలాడిపోతాడు. ఏపీ రాజధాని అమరావతిలోని కొన్ని గ్రామాలలో రైతులు పడుతున్న ఆవేదన, వారికి ఎదురైన దారుణమైన అనుభవం చూసేవారి కంట నీరు తెప్పిస్తుంది. సడన్‌గా ప్రభుత్వ అధికారులు, పోలీసులు వచ్చి పంటలను వారి కళ్లెదుటే ధ్వంసం చేస్తుంటే ఆ రైతులు, రైతు మహిళలు ఎవరికి చెప్పుకోవాలి. తమను రక్షించవలసిన ప్రభుత్వమే క్రూరంగా వ్యవహరిస్తుంటే రోదనలు, వేదనలు తప్ప ఏమి మిగులుతాయి!

కొద్దిరోజుల క్రితం ఉండవల్లి గ్రామంలో కొన్ని భూములను సేకరించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అనుసరించిన పద్దతి ఏ మాత్రం నాగరికంగా లేదన్న విమర్శలు వస్తున్నాయి. బుల్ డోజర్‌లు, జేసీబీలు తెచ్చి పచ్చని పంటలను దున్నేస్తుంటే, అక్కడ ఉన్న మహిళల ఆక్రందనలు ఆకాశానికి అంటాయి. అక్కడికి సమీపంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంది. ఈ రైతుల ఆక్రందనలు ఆయనకు వినిపంచలేదా అంటే ఏమి చెబుదాం. ఇదే తరహాలో ఎక్కడైనా గత వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగి ఉంటే అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్ని ఆరోపణలు చేసేవారో చెప్పలేం. ఎల్లో మీడియా అయితే నానా రభస సృష్టించేవి.

కృష్ణానది గర్భంలో పర్యావరణానికి విరుద్దంగా, అనుమతులు లేకుండా 2014 టరమ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రజావేదిక పేరుతో ఒక నిర్మాణం చేసింది. ప్రభుత్వమే ఇలా నిబంధనలకు విరుద్దంగా నిర్మించడం ఏమిటని, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూల్చివేసింది. దానిని విధ్వంసంగా అభివర్ణిస్తూ చంద్రబాబుతో పాటు, ఇతర పార్టీల నేతలు నానా రచ్చ చేశారు. ఐదేళ్లపాటు అదే ప్రచారం చేశారు. ఆ వేదిక కూల్చడం వల్ల ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతం వెళ్లింది. ఎవరూ చట్టాన్ని అతిక్రమించరాదన్న విషయాన్ని తెలియచేసినట్లయింది. అయినా అలా చేయడాన్ని తప్పు అని చెప్పిన టీడీపీ ఇప్పుడు ఏకంగా రైతుల జీవితాలు ధ్వంసం అయ్యేలా పంట పొలాలను నాశనం చేయడం ధర్మమేనా అని అడిగితే బదులు ఇచ్చేవారు లేరు. పైగా ఎల్లో మీడియా అలాంటి అకృత్యాలకు అండగా నిలబడి ఆ వార్తలను కప్పిపుచ్చే యత్నం చేసింది.

కొన్నాళ్ల క్రితం ఒంగోలు సమీపంలోని కరేడు వద్ద కూడా బలవంతపు భూ సేకరణకు ప్రయత్నిస్తే రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉండవల్లి, పెనుమాక, తదితర కొన్ని గ్రామాల రైతులు రాజధాని అవసరాలకు పొలాలు ఇవ్వకపోలేదు. సీడ్ యాక్సిస్ రోడ్డుకు కావల్సిన భూమి తీసుకుని, మిగిలినది తమకే వదలివేయాలని వారు కోరారు. ఆ భూమి ఇవ్వడానికి వీరు ఇష్టపడలేదు. అయినా ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరిపి, వారు కోరిన విధంగా పరిహారం ఇచ్చి భూములు తీసుకోవచ్చు. అలాకాకుండా మార్కెట్ రేట్ కన్నా తక్కువ మొత్తాన్ని ఏకపక్షంగా వారి ఖాతాలలో జమచేసి భూములు లాక్కోవడం సమంజసమేనా? అందులోను రెండు, మూడునెలల్లో పంటలు వచ్చేవరకు ఆగకుండా వాటిని పాడు చేయడం ద్వారా ప్రభుత్వం ఏమి సాధిస్తుంది? రైతులను ఏడిపించడం తప్ప.

కొందరు మహిళలు కూటమి ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టిన తీరును అంతా గమనించారు. గత కొన్ని నెలలుగా ఈ గ్రామాల రైతులను రకరకాల రూపాలలో ప్రభుత్వం వేధించింది. లాండ్ పూలింగ్‌కు ఈ రైతులు భూములు ఇవ్వలేదు. అయినా వీరి భూములను ఎల్‌పీఎస్‌ కింద వేరే వారికి ప్లాట్లు కేటాయించింది. ఈ అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని అడిగితే ఎవరూ జవాబు ఇవ్వలేదు. రైతుల పంటపొలాల చుట్టూ గోతులు తవ్వడం, స్తంభాలు కూల్చి కరెంటు ఆపేయడం, మోటార్లు, పైపులు మాయం చేయడం వంటివి చేశారు. ఎవరైనా ఇతరులు ఇలా చేస్తే రౌడీయిజం అని, దౌర్జన్యం అని విమర్శిస్తారు. ఏకంగా ప్రభుత్వ అధికారులే ఈ దుశ్చర్యలకు పాల్పడితే, పోలీసుల అండ చూసుకుని పంటలను దున్నించివేస్తే ఏమనాలి? ఆ బాధ తట్టుకోలేక, తన భూమిని అమ్ముకోనివ్వలేదన్న ఆవేదనతో పద్మనాభ రెడ్డి అనే రైతు గుండెపోటుకు గురై మరణించారన్న సమాచారం మరింత ఆవేదన కలిగిస్తుంది. ఇది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఇన్‌చార్జీ దొంతిరెడ్డి వేమారెడ్డి విమర్శించారు.

ఇక ప్రభుత్వ అనుకూల వ్యక్తులు, శక్తులు రాజధానిలో భూములు ఇవ్వని వారిని ఆన్‌లైన్‌లో అసభ్యకరంగా ట్రోలింగ్ చేశారట. ఇలాంటివాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. పైగా సోషల్ మీడియాపై నిత్యం చంద్రబాబు, తదితరులు నీతులు చెబుతుంటారు. ఈ రైతులు ఎవరూ కోర్టుకు వెళ్లకుండా సెలవు దినాలలో ఈ పనికి తెగబడ్డారు. ఇప్పటికే కోర్టులలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయట. ఇక్కడ సాగు చేసుకుంటున్నవారిలో మెజార్టీ చిన్న, సన్నకారు వారే. ఏభై వేల ఎకరాల భూమి అందుబాటులో ఉన్నా, అక్కడ నిర్మాణాలు ఇంకా కొలిక్కి రాకపోయినా, బలవంతంగా తక్కువ పరిహరం ఇచ్చి తమ భూములు లాక్కున్నారని కొందరు వాపోతున్నారు.

ఉండవల్లి, పెనుమాక వంటి గ్రామాలలో రాజధానితో సంబంధం లేకుండానే భూముల విలువ కోట్లలో ఉంది. ఆ సంగతి అందరికి తెలుసు. ఒక రైతును ఏడిపించి భూమిని తీసుకున్నా, తాను అంగీకరించబోనని గతంలో బీకర ప్రతిజ్ఞలు చేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనీసం వీరికి సానుభూతి కూడా తెలిపినట్లు కనిపించలేదు. ముఖ్యమంత్రికి ఈ దౌర్జన్యాలు సరికాదని చెప్పలేకపోయారు. కొన్నాళ్ల క్రితం ఉండవల్లి రైతుల బాధలు వినడానికి వెళుతున్న వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడిచేసి అడ్డుకున్నారు. ఈ పరిస్థితి బహుశా దేశంలో మరే రాష్ట్రంలో ఉండదేమో!

ఒకప్పుడు ఢిల్లీ సమీపంలో భూ సేకరణపై జరిగిన రగడ దేశవ్యప్తంగా సంచలనం అయింది. కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం తదితర పక్షాలన్నీ కలిసి కొత్త భూ సేకరణ చట్టాన్ని తెచ్చి, మారర్కెట్ రేటుకు మూడు రెట్లు అధికంగా రైతులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు అవే పార్టీలు ఆ చట్టంతో సంబంధం లేకుండా లాండ్ పూలింగ్ అనే విధానాన్ని కనిపెట్టి రైతులను మభ్యపెట్టి భూములు తీసుకుంటున్నాయి. దీనివల్ల ఎక్కడైనా కొద్దిమందికి ప్రయోజనం కలిగిందేమో తెలియదు. కాని ఎక్కువమంది నష్టపోతున్నారు. దానికి అమరావతి భూ సమీకరణే ఉదాహరణ కావచ్చు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం రైతులపట్ల, మహిళలపట్ల కనికరం లేకుండా ప్రవర్తించడం మాత్రం అత్యంత బాధాకరం అని చెప్పాలి.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement