భార్య, అత్త, మైనర్ మరదలిపై అత్యాచారం చేసిన అల్లుడు! | Kakinada Three Woman's Incident | Sakshi
Sakshi News home page

భార్య, అత్త, మైనర్ మరదలిపై అత్యాచారం చేసిన అల్లుడు!

Jul 20 2026 8:33 AM | Updated on Jul 20 2026 8:59 AM

Kakinada Three Woman's Incident

కాకినాడ క్రైం: కాకినాడ బుడంపేటలో ఘోరం చోటు చేసుకుంది. ఓ కీచకుడి చేతిలో చిక్కుకుని నిండు కుటుంబం విలవిలలాడుతోంది. మూడేళ్లుగా జరుగుతున్న ఈ ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలివీ.. కాకినాడ బుడంపేటకు చెందిన 24 ఏళ్ల నిందితుడు జులాయిగా తిరుగుతూండేవాడు. మూడేళ్ల క్రితం బాధితుల ఇంటి పక్కనే ఉన్న ఇంట్లో తన కుటుంబంతో కలసి అద్దెకు ఉండేవాడు. అప్పటికి 17 ఏళ్ల వయసున్న ఆ ఇంట్లోని బాలికపై కన్ను వేసి ఆమెను వశపరుచుకున్నాడు. గర్భం దాల్చిన ఆ బాలికను వదిలేయాలనుకోగా ఆమె తల్లి ఆ యువకుడిని బతిమాలుకుంది.

 తన కుమార్తె జీవితాన్ని అన్యాయం చేయవద్దని వేడుకుంది. ఇదే అదునుగా ఆ దుర్మార్గుడు తల్లిని లోబరుచుకున్నాడు. అనంతరం, ఆమె కుమార్తెను పెళ్లి చేసుకోబోనని మరోసారి మొండికేశాడు. బాలిక బంధువులు జోక్యం చేసుకుని, ఏడాది క్రితం ఆ యువకుడికి, బాలికకు నగరంలోని ఓ ఆలయంలో బలవంతంగా పెళ్లి చేశారు. తల్లితో జరిగిన ఘోరం బంధువులెవ్వరికీ తెలియకపోవడంతో పెళ్లి తర్వాత సమస్య పరిష్కారమైపోయిందని అందరూ భావించారు. అయితే, ఆ దుర్మార్గుడు భార్యను వదిలేస్తానంటూ ఆమె తల్లిపై తరచుగా అఘాయిత్యానికి పాల్పడేవాడు. 

మరోవైపు 13 ఏళ్ల ఆమె చిన్న కుమార్తె (భార్య చెల్లెలు)పై సైతం అక్క జీవితం నాశనం చేస్తానంటూ బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న ఆ తల్లితో పాటు కుమార్తెలిద్దరూ దిక్కుతోచని స్థితిలో కుమిలిపోయేవారు. ఈ నేపథ్యంలో 13 ఏళ్ల బాలిక సైతం గర్భం దాల్చింది. దీనిపై ఆమె తల్లి (ఆ యువకుడి అత్త) నిలదీయగా.. విషయం పెద్దది చేసుకుంటే మీ కుటుంబమే నష్టపోతుందని, నీ భర్త నిన్ను చంపేస్తాడని, పెద్ద కుమార్తెను వదిలేస్తానని, చిన్న కుమార్తెకు పెళ్లి కాదని అంటూ, తనను కాపాడుకోవలసిన బాధ్యత వారిదేనని బెదిరించాడు. గర్భవిచి్ఛత్తికి మాత్రలు తెచ్చేంత వరకూ ఏ ఒక్కరూ మాట్లాడరాదంటూ భార్య, అత్త నోర్లు మూయించాడు. 

కౌన్సెలింగ్‌తో సరి 
జరిగిన ఘోరం తెలుసుకున్న నిందితుడి సమీప బంధువు కలెక్టరేట్, ఎస్పీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలతో పాటు స్థానిక సచివాలయం, మానవ హక్కులు, బాలల హక్కుల కమిషన్లకు ఈ–మెయిల్‌తో పాటు వివిధ మార్గాల్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు మాత్రం ఈ విషయంపై ఆరా తీశారు. బాధితులతో పాటు దారుణాలకు పాల్పడిన నిందితుడిని శనివారం తమ కార్యాలయానికి పిలిపించారు. పీడీ చెరుకూరి లక్ష్మి ఆధ్వర్యాన నిందితుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేశారు. ఇలాంటి దుర్మార్గాలకు మరోసారి పాల్పడవద్దని హెచ్చరించి వదిలేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement