బీళ్లు.. రైతుల కన్నీళ్లు.. నీరందక బీటలు వారిన పొలాలు
డెల్టా ఎండుతోంది
కృష్ణా, గోదావరి డెల్టాల్లో శివారు భూములకు నీరు కరువు
దెందులూరులో తీవ్రమైన సాగునీటి కష్టాలు
జలవనరుల శాఖ నిర్లక్ష్యం
తూతూమంత్రంగా కాలువ పనులు
జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో 79 వేల ఎకరాల్లోనే నాట్లు
గతేడాది ఇదే సమయానికి 1.40 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: డెల్టాలో భూమి బీటలు వారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పచ్చని పంట పొలాలతో కళకళలాడే భూములు బీడులుగా మారుతున్నాయి. సర్కారు అంతులేని నిర్లక్ష్యం, ప్రణాళికా లోపంతో కృష్ణా, గోదావరి ప్రధాన కాలువల పూడికతీత పనులు తూతూమంత్రంగా నిర్వహించారు. ఫలితంగా దిగువకు నీరు పారకపోవడంతో డెల్టా బీటలు వారుతుంది. మరోవైపు 70 శాతం పూర్తి కావాల్సిన వరినాట్లు జిల్లాలో 40 శాతానికే పరిమితమయ్యాయి.
50 రోజులు గడిచినా.. ఖరీఫ్ కష్టాలు నీటి రూపంలో అన్నదాతలను వెంటాడుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 55 రోజులు గడిచినా పూర్తిస్థాయిలో నాట్లు పడలేదు. ఇప్పటివరకు జిల్లాలో 79,419 ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. గతేడాది ఇదే సమయానికి సుమారు 1.40 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. కృష్ణా, గోదావరి డెల్టాల నుంచి నారుమడులకు నీటిని ఇప్పటికే విడుదల చేశారు. జూన్ 1న గోదావరి డెల్టా, జూలై 1 నుంచి కృష్ణా డెల్టా నీటిని జిల్లాలో విడుదల చేశారు. రెండు డెల్టాల పరిధిలో దెందులూరు, కైకలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో అత్యధిక సాగు విస్తీర్ణం ఉంటుంది. ఈ పరిణామాల క్రమంలో రెండు కాలువలకు అయితే నీరు విడుదల చేసినా చివరి వరకు నీరందని పరిస్థితి.
పూర్తిస్థాయిలో లేని ప్రవాహం : వాస్తవానికి ప్రతి సీజన్ ప్రారంభంలో జలవనరుల శాఖ కాల్వల్లో తూడు, గుర్రపుడెక్క, సిల్ట్ తొలగించి నీటి పారుదలకు ఇబ్బందులు కుండా అవసరమైన మరమ్మతులు కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తుంది. ఈ ఏడాది కూడా అలానే కొన్ని పనులు చేశారు కానీ నీరు పూర్తిస్థాయి ప్రవాహం మాత్రం లేని పరిస్థితి. దీంతో ప్రధానంగా గోదావరి డెల్టా పరిధిలోని భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, దెందులూరు, కృష్ణా డెల్టా పరిధిలోని పెదపాడు, ఏలూరు రూరల్, దెందులూరు, ముదినేపల్లి మండలాల్లో వరిసాగు ఇబ్బందికరంగా మారింది. తాజాగా దెందులూరు మండలంలో కొవ్వలి, పోతునూరు, సత్యనారాయణపురం, దెందులూరు, కొమిరేపల్లి, ఏలూరు రూరల్ మండలంలోని పాలగూడెం, అలాగే భీమడోలులో కొన్ని గ్రామాల్లో రైతులు లక్షలు ఖర్చు పెట్టి నాట్లు వేసినా నీరందడం లేదు. చాట్రాయి మండలంలో తమ్మిలేరు పరిధిలో 13,200 ఎకరాల విస్తీర్ణంలో సాగు ఉంది. దీనికి కూడా నీటి ఇబ్బందులు తీవ్రమయ్యాయి.
పట్టిసీమ జలాలు తప్పనిసరి
జిల్లా రైతులు పట్టిసీమ జలాల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రధానంగా పట్టిసీమ జలాలు కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలో ఉన్న గ్రామాల్లో నారుమడుల కోసం విడుదల చేస్తే కొంత మేరకు ఇబ్బందులు తగ్గుతాయి. జానంపేట వద్ద తమ్మిలేరులోకి పట్టిసీమ జలాలు మళ్లిస్తే తూర్పు, పడమర లాకుల ద్వారా శివారు భూముల వరకు నీరందించే పరిస్థితి ఉంది. జిల్లా యంత్రాంగంతో పాటు పాలకులు పూర్తిగా పట్టించుకోకపోవడంతో అన్నదాతల వేదన అరణ్య రోదనగా మారింది.
ఇప్పటికే గతేడాది దిగుబడులు గణనీయంగా తగ్గడంతో ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల నష్టం వాటిల్లింది. పేరుకే మద్దతు ధర ఉన్నా దళారుల దోపిడీ, దిగుబడి తగ్గడంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. దీంతో పాటు మోంథా తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామని రాష్ట్ర, కేంద్ర బృందాలు హడావుడి పర్యటన మినహా ఒక్క రైతుకు రూపాయి జమకాని పరిస్థితి. ఇక ఈ ఏడాది సాగునీటి ఇబ్బందులు కొనసాగితే నూరు శాతం నాట్లు కూడా అనుమానంగా మారే పరిస్థితి ఉంది.


