వృద్ధురాలైన తల్లిని కాలువలోకి నెట్టేసిన కుమార్తె
ఆ తర్వాత ఆమె కూడా దూకేసింది
కుమార్తె మృతదేహం లభ్యం.. తల్లి కోసం గాలింపు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన
రావులపాలెం: అనారోగ్య కారణాలతో తల్లిని సక్రమంగా చూడలేకపోతున్నానని తీవ్రంగా బాధపడుతున్న ఓ మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తాను, వృద్ధురాలైన తన తల్లి కుటుంబానికి భారం కాకూడదని భావించింది. వృద్ధాశ్రమంలో చేర్పిస్తానని చెప్పి తీసుకువెళ్లి తన తల్లిని కాలువలోకి నెట్టివేసింది. ఆ తర్వాత ఆమె కూడా కాలువలోకి దూకేసింది. ఈ విషాద ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామం వద్ద ఆదివారం జరిగింది.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామంలో మీసాల సూర్యవతి(60), సూర్యనారాయణ దంపతులు నివాసం ఉంటున్నారు. సూర్యవతి తల్లి వాడపల్లి బూరమ్మ(80) కూడా వారి వద్దే ఉంటున్నారు. బూరమ్మ కుమారుడు కొంతకాలం క్రితం మరణించడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సూర్యవతి కూడా ఇటీవల మోకాళ్లు, నడుము నొప్పితోపాటు వివిధ అనారోగ్యాలతో బాధపడుతోంది. అనారోగ్య కారణాలతో తల్లిని సరిగా చూడలేకపోతున్నానని సూర్యవతి ఆవేదనకు గురయ్యేది.
వృద్ధాశ్రమంలో చేర్పిస్తానని...
తామిద్దరం కుటుంబ సభ్యులకు భారం కాకూడదని భావించిన సూర్యవతి ఆదివారం ఉదయం తల్లి బూరమ్మను వృద్ధాశ్రమంలో చేర్పిస్తానంటూ చొప్పెల్లలోని ఇంటి నుంచి బయల్దేరింది. తల్లితో కలసి రావులపాలెం మండలం ఊబలంక గ్రామం వద్దకు చేరుకుంది. గ్రామంలోని పెద్ద వంతెనపైకి చేరుకుని తల్లిని కాల్వలోకి నెట్టేసింది. ఆ తర్వాత సూర్యవతి కూడా దూకేసింది. స్థానికులు గమనించి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే సూర్యవతి మృతదేహం నీటిపై తేలడంతో ఒడ్డుకు చేర్చారు. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో బూరమ్మ గల్లంతైంది. సూర్యవతి భర్త సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బూరమ్మ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రావులపాలెం ఎస్‌ఐ చంటి తెలిపారు.


