సీఎం చంద్రబాబుపై ‘ఎక్స్’లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు
రూ.4,929 కోట్ల ప్రజాధనంతో కట్టిన పోర్టును కేవలం రూ.1,500 కోట్లకే ప్రైవేటు వ్యక్తులకు
అమ్మేయడం ద్వారా అభివృద్ధి చేస్తున్నారా? కుంభకోణం చేస్తున్నారా?
పైగా రూ.3,500 కోట్లకుపైగా అప్పులు తీర్చే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది
పోర్టు ఆధారిత అభివృద్ధితో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అపార అవకాశాలు
రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
భూసేకరణ, ఆర్థిక వనరుల సమీకరణతోసహా అన్ని రకాల అనుమతులు వేగంగా పూర్తి
2024 జూన్ నాటికే మూడు పోర్టుల నిర్మాణ పనుల్లో గణనీయమైన పురోగతి సాధించాం
బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, ఇండోసోల్ సోలార్ పరిశ్రమలు రామాయపట్నం పోర్టు సాధించిన అద్భుత ప్రగతికి తార్కాణాలు
రామాయపట్నం నుంచి వైఎస్సార్ కడప జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నిర్మీస్తున్న స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం, కోకింగ్ కోల్ వంటి ముడిపదార్థాల రవాణా
వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధితోపాటు రాష్ట్ర సొంత ఆదాయాన్ని భారీగా పెంచేందుకు దోహదం
కానీ.. ఈ పోర్టును టీడీపీ ప్రభుత్వం ఒక పెద్ద కుంభకోణంగా మార్చేస్తోంది
సాక్షి, అమరావతి: రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.4,929 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన పోర్టును కేవలం రూ.1,500 కోట్లకే ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడం ద్వారా అభివృద్ధి చేస్తున్నారా? కుంభకోణం చేస్తున్నారా? అని టీడీపీ కూటమి సర్కార్‌ను సూటిగా నిలదీశారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని స్పష్టం చేశారు. ఇదెక్కడి ఆర్థిక విధానం? అని సీఎం చంద్రబాబును నిలదీస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ ఆదివారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..
పోర్టు ఆధారిత అభివృద్ధి.. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అపార అవకాశాలు
ఓడరేవుల (పోర్టుల) ఆధారిత అభివృద్ధి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అపారమైన అవకాశాలను కల్పిస్తుంది. ఈ స్పృహతోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట అనే మూడు పోర్టుల అభివృద్ధికి సంబంధించి ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది. ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి అత్యంత కీలకమైన భూసేకరణ, ఆర్థిక క్లోజర్ (ఆర్థిక వనరుల సమీకరణ)సహా అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వేగంగా పూర్తి చేసింది. అంతేకాకుండా పనులను సకాలంలో పూర్తి చేయడానికి ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్) విధానంలో కాంట్రాక్టు ఒప్పందాలను కుదుర్చుకుని జూన్ 2024 నాటికే ఈ మూడు పోర్టుల నిర్మాణ పనుల్లో గణనీయమైన పురోగతిని సాధించింది.
రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి ఊతం
రామాయపట్నం పోర్టు సాధించిన అద్భుత ప్రగతికి, తద్వారా లభించనున్న ఆర్థిక వృద్ధికి ఇక్కడికి వస్తున్న భారీ ప్రాజెక్టులే నిదర్శనం. అందులో ఒకటి బీపీసీఎల్ ప్రతిష్టాత్మకంగా నిర్మీస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాగా మరొకటి ఇండోసోల్ సోలార్ గిగా స్థాయి తయారీ ప్లాంట్. డీప్ వాటర్ పోర్టును నిర్మీంచడం ద్వారా ముడి చమురు దిగుమతి చేసుకుని.. సుమారు రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో ఏడాదికి 9–12 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపీఏ) రిఫైనింగ్ సామర్థ్యంతో బీపీసీఎల్ ప్లాంట్ ఈ పోర్టుకు అతి సమీపంలోనే ఏర్పాటు కానుంది.
మరోవైపు ఇండోసోల్ ప్లాంట్ పూర్తిగా సమగ్రమైన ‘క్వార్ట్‌జ్–టు–మాడ్యూల్‘ ఎకో సిస్టమ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడానికి, ఉత్పత్తి చేసిన సోలార్ మాడ్యూళ్లను సమర్థంగా ఎగుమతి చేయడానికి డీప్‌వాటర్ సదుపాయం ఉన్న రామాయపట్నం పోర్టు సమీపంలోనే ఉండటం అత్యంత కీలకం. వీటికి తోడు వైఎస్సార్ కడప జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నిర్మీస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన ఇనుప ఖనిజం, కోకింగ్ కోల్ లాంటి బల్క్ ముడి పదార్థాల రవాణా కోసం రామాయపట్నం పోర్టులోనే రెండు ప్రత్యేక బెర్తులను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్ర సొంత ఆదాయాన్ని భారీగా పెంచడానికి దోహదపడతాయి.
అభివృద్ధి ముసుగులో భారీ దోపిడీ..
రామాయపట్నం పోర్టు అభివృద్ధి వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉన్నప్పటికీ, అలాగే ప్రభుత్వ పన్ను, పన్నేతర ఆదాయాలకు గణనీయమైన ప్రయోజనాలు చేకూరే మార్గాలున్నప్పటికీ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మాత్రం దీనిని ఒక పెద్ద కుంభకోణంగా మార్చడానికే ప్రాధాన్యత ఇస్తోంది. తద్వారా తమ పార్టీ పెద్దలకు భారీ ఎత్తున ముడుపులు వసూలు చేసుకునేందుకు మార్గం సుగమం చేసింది.
ప్రభుత్వం ఏకంగా రూ.4,929 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మిస్తున్న ఈ పోర్టును కేవలం రూ.1,500 కోట్లకే ప్రైవేటు వ్యక్తులకు టీడీపీ ప్రభుత్వం కట్టబెడుతోంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఊహించని రీతిలో భారీ నష్టం వాటిల్లుతోంది. ఒకవైపు పోర్టును ప్రైవేట్ పరం చేస్తూనే మరోవైపు దానికి సంబంధించి రూ.3,500 కోట్లకు పైగా అప్పులను తీర్చే భారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి రావడం గమనార్హం! చంద్రబాబు గారూ.. ఇదెక్కడి ఆర్థిక విధానం?


