ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ప్రజలు | Villagers intercept illegal sand transport: Tirupati district | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ప్రజలు

Jul 20 2026 5:03 AM | Updated on Jul 20 2026 5:03 AM

Villagers intercept illegal sand transport: Tirupati district

నిరసన తెలుపుతున్న గ్రామస్తులు, టీడీపీ శ్రేణులు

20 టన్నులు మోయాల్సిన రోడ్డుపై 50 టన్నుల ఇసుక రవాణా 

రోడ్లు పాడవుతుండటంతో గ్రామస్తుల ఆగ్రహం    

గ్రామస్తులకు మద్దతుగా నిలిచిన కొందరు టీడీపీ శ్రేణులు   

తిరుపతి జిల్లా, రైల్వేకోడూరు పరిధిలో ఘటన

రైల్వేకోడూరు అర్బన్‌: ఇసుక అక్రమ రవాణాను గ్రామస్తులు అడ్డుకున్న ఘటన తిరుపతి జిల్లా, రైల్వేకోడూరు పరిధిలో చోటుచేసుకుంది. చిట్వేలి–కోడూరు రోడ్డు విస్తరణకు ఎంతో కాలంగా స్థానికులు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. దశాబ్దాల కాలంనాటి వీరి కల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చొరవతో నెరవేరింది. రోడ్డు బాగుపడింది. అయితే ఇటీవల టీడీపీ నాయకుల అక్రమ ఇసుక రవాణా కారణంగా రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఈ క్రమంలో చిట్వేలి మండలంలోని పెద్దూరు గ్రామంలో ప్రధాన రహదారి ఇసుక లారీల రాకపోకలతో అధ్వానంగా మారింది.

ఈ లారీల వల్ల దశాబ్దాలుగా కలలుగని సాధించుకున్న రోడ్డు కళ్లెదుటే పాడవుతుంటే గ్రామస్తులు తట్టుకోలేకపోయారు. ఇసుక అధికలోడ్‌తో తరలిస్తున్న దాదాపు 20 లారీలను అడ్డుకున్నారు. 20 టన్నులు మోయాల్సిన రోడ్డుపై 50 టన్నుల ఇసుక రవాణా ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు కూడా గ్రామస్తులకు మద్దతుగా నిలిచారు.  గ్రామస్తుల ఆగ్రహంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో సమాచారం అందుకున్న  రూరల్‌ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆగిన లారీలను పక్కనబెట్టించి ట్రాఫిక్‌ను క్రమబద్ధికరించారు.

అయితే ఈ ఇసుక అక్రమ దందాపై పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న విషయం ఆసక్తిగా మారింది. కాగా,  చంద్రబాబు ప్రభుత్వంలో రైల్వేకోడూరులో టీడీపీ నాయకుల అరాచకాలు ముఖ్యంగా భారీ ఇసుక దందా అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వర్గ విభేదాలతో రచ్చయినా ఇవేమీ పట్టించుకోని టీడీపీ ఇన్‌చార్జ్‌ ముక్కా రూపానందరెడ్డి.. తన అనుచరుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను జనసేన ఎమ్మెల్యేగా ప్రకటించి గెలిపించుకొని తన హవా, అధికార దర్పాన్ని కొనసాగిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. తాజాగా సాగుతున్న ఇసుక అక్రమ దందా టీడీపీ వినాశనానికే దారితీస్తుందని స్థానికులు విమర్శిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement