హంద్రీ–నీవా ప్రాజెక్టు పరిరక్షణ పోరుబాటకు తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు, రైతులు
హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పేరుతో రూ.వందల కోట్ల స్వాహా
చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ గ్రేటర్ రాయలసీమ నేతల ఆగ్రహం
అనంతపురం: ప్రాణాలైనా అర్పిస్తాం.. సీమ రైతన్నను కాపాడుకుంటామని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రతినబూనారు. రాయలసీమకు మరీముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు జీవనాడి అయిన హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు స్వాహా చేసిన వైనంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సిమెంట్ రంగు వేసి.. లైనింగ్ పూర్తి చేసినట్లు రూ.3,500 కోట్లకుపైగా ఖర్చు చూపించి.. వందల కోట్లను చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు దోపిడీ చేశారని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు ఆదివారం హంద్రీ–నీవా ప్రాజెక్టు పరిరక్షణ పోరుబాట నిర్వహించారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం చోళసముద్రం గ్రామ సమీపంలో హంద్రీ–నీవా కాలువను వైఎస్సార్‌సీపీ నేతలు పరిశీలించారు. రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. టాస్‌్కఫోర్స్ కమిటీ కనీ్వనర్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, వైఎస్సార్‌సీపీ అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు అనంత వెంకట్రామి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి తదితరులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘హంద్రీ–నీవా లైనింగ్ పట్టుకుంటే ఊడిపోయే పరిస్థితిలో ఉంది.
వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. కానీ ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. కుప్పంకు నీరు తీసుకెళ్లే క్రమంలో అన్నదాతకు శాశ్వత సమాధి కట్టారు. లైనింగ్ వల్ల ఈ ప్రాంత రైతుల బోర్లు ఎండిపోయాయి. చీనీ, మామిడి చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ సీమకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.
చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు ఖండించకపోవడం, రాయలసీమ ప్రజల ప్రయోజనాల పట్ల ఆయన వైఖరిని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై నోరు మెదపకపోవడం దారుణం’’ అని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్‌ఫోర్స్ కమిటీ అనంతపురం జిల్లా కో ఆర్డినేటర్ నార్పల సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


