అనంతపురం అగ్రికల్చర్: దరఖాస్తు చేసుకున్న పది రోజులకే ట్రాక్టర్లు, ఇతరత్రా యంత్ర పరికరాలు అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెప్పింది. దరఖాస్తులు ఎక్కువైతే సిఫారసులకు తావులేకుండా జాయింట్ కలెక్టర్ సమక్షంలో లాటరీ విధానంలో అత్యంత పారదర్శకంగా యంత్ర సాయం చేస్తామని డాంబికాలు పలికింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా రైతులకు ఎలాంటి పరికరాలు ఇవ్వకుండా మభ్యపెడుతున్న పరిస్థితి నెలకొంది. గతేడాదికి సంబంధించి అంటే 2025–26 కింద సబ్‌మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (ఎస్‌ఎంఏఎం) పథకం రూ.9.27 కోట్ల బడ్జెట్‌తో యాంత్రీకరణ పథకం అమలు చేస్తున్నట్లు గత మే నెల మొదటి వారంలో ప్రకటించారు. అదే నెలాఖరులో రైతులకు యంత్రసాయం చేస్తామని ప్రకటించి దరఖాస్తులు ఆహ్వానించారు.
పెద్ద సంఖ్యలో దరఖాస్తులు..
ఆర్‌ఎస్‌కేల్లో దరఖాస్తు చేసుకున్న రైతులకు యాంత్రీకరణ పథకం కింద మే నెలాఖరులోపు 40 హెచ్‌పీ ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, రోటావీటర్లు, హార్వెస్టర్లు, విత్తన గొర్లు, తవ్వే యంత్రాలు, గుంటకలు, పవర్‌టిల్లర్లు, స్పేయర్లు ఇలా అన్ని రకాల పనిముట్లు వ్యక్తిగతంగా అందిస్తామని ప్రకటించారు. ఐదెకరాల్లోపున్న చిన్న,సన్నకారు రైతులకు 50 శాతం, మిగతా రైతులకు 40 శాతం రాయితీ వర్తింపజేశారు. పరికరాలు అందుకున్న వెంటనే రైతుల ఖాతాల్లోకి రాయితీ జమ చేస్తామని తెలిపారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.9.27 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. మే 19లోపు దరఖాస్తు గడువు విధించి మిగతా ప్రక్రియ, పంపిణీ నెలాఖరులోపు పూర్తి చేస్తామన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులు ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల కోసం ఆర్‌ఎస్‌కేలు, ఆన్‌లైన్ పోర్టల్‌లో పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం యాంత్రీకరణ పథకం అమలు చేయడానికి వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఉన్నఫలంగా షెడ్యూల్ కాస్త జూన్ నెలకు మార్పు చేశారు. మళ్లీ నేడు జూలైకు పొడిగించినా ఇప్పటికీ ప్రక్రియ ముందుకు కదలడం లేదు.
రూ.9 కోట్ల బడ్జెట్‌కు
రూ.90 కోట్ల విలువ చేసే దరఖాస్తులు
పారదర్శకత, లాటరీ అంటూ
‘బాబు’ సర్కారు గొప్పలు
‘తమ్ముళ్ల’ మధ్య పోటీతో
ఆగిపోయిన యాంత్రీకరణ పథకం
రైతుల పెదవి విరుపు
రూ.9.27 కోట్లు బడ్జెట్ ఉండగా రూ.90 కోట్ల విలువ చేసే పరికరాలు, ట్రాక్టర్ల కోసం రైతుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నేతలు, తమ్ముళ్ల మధ్యనే పెద్ద ఎత్తున పోటీ ఉండటంతో ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడటంతో తాత్కాలికంగా విరామం ప్రకటించినట్లు చెబుతున్నారు. ‘తమ్ముళ్ల’కే న్యాయం చేసే పరిస్థితి లేనందున నిబంధనలు మార్పు చేయడం, వ్యక్తిగతంగా కాకుండా గ్రూపుల కింద ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 2026–27 ఏడాది ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా గతేడాదికి సంబంధించిన బడ్జెట్‌నే ఖర్చు చేయకుండా జాప్యం చేస్తుండటంపై రైతులు పెదవి విరుస్తున్నారు.


