ఉరవకొండ: గవిమఠం సంస్థానం 8వ పీఠాధిపతి జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామికి భక్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. స్వామి వారి పార్థివ దేహన్ని దర్శించుకోవడానికి ఆదివారం ఉదయం నుంచే భక్తులు తరలివచ్చారు. గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి, కల్యాణస్వామి, సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో స్వామి వారి పార్థివ దేహాన్ని విశేష పుష్పాలతో అలంకరించిన అనంతరం వాహనంలో పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఓం నమఃశివాయ నామస్మరణ చేస్తూ ముందుకు కదిలారు. పార్థివదేహంపై పూలు చల్లి భక్తిభావాన్ని చాటుకున్నారు. క్లాక్‌టవర్ మీదుగా పాత గాంధీబజారు నుంచి వెలిగొండ రోడ్డులోని స్వామి వారి విడిది మంటపం వరకు వెళ్లి తిరిగి గవిమఠానికి తీసుకొచ్చారు.
మూడేళ్ల క్రితమే సమాధి నిర్మాణానికి భూమి పూజ..
గవిమఠంలోని పూర్వ పీఠాధిపతుల సమాధులు ఉన్న సముదాయం ఆవరణలోనే తన అంతిమ సంస్కారాలు నిర్వహించేలా మూడేళ్ల క్రితమే జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి నిర్ణయించారు. అంతే కాకుండా తన సమాధికి భూమి పూజ కూడా చేయడం గమనార్హం. పూర్వ పీఠాధిపతుల వారి గద్దెల ప్రదేశంలోనే స్వామి పార్థివదేహాన్ని ఉంచి సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. స్వామి వారి అంతిమ సంస్కారాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వైఎస్సార్ సీపీ యువ నాయకుడు వై.భీమిరెడ్డితో పాటు కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలోని వివిధ మఠాల నుంచి 48 మంది పీఠాధిపతులు హాజరయ్యారు. కర్ణాటకకు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వామి పార్థివదేహం వద్ద నివాళులర్పించారు.


