పోరాడి సాధించుకుందాం
అనంతపురం: రాయలసీమకు సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై రైతులు కదం తొక్కారు.తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించారని మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు జీవనాడి అయిన హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పేరుతో రూ.3,500 కోట్ల ఖర్చు చూపించి వందలాది కోట్లను చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, టీడీపీ కాంట్రాక్టర్లు దోపిడీ చేశారని దుయ్యబట్టారు. గ్రేటర్ రాయలసీమ సాగునీటి హక్కుల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్న పార్టీ నిర్ణయం మేరకు ఆదివారం వైఎస్సార్‌సీపీ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హంద్రీ–నీవా ప్రాజెక్ట్ పరిరక్షణ పోరుబాట విజయవంతమైంది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, రైతులు ఉత్సాహంగా తరలివచ్చారు. ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు కూడేరు మండలం చోళసముద్రం సమీపంలో హంద్రీ–నీవా కాలువలో రెండు కిలోమీటర్ల మేర రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి లైనింగ్‌ను పరిశీలించారు. పార్టీ అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్, పీఏసీ సభ్యుడు వై. విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, టాస్క్‌ఫోర్స్ కమిటీ జిల్లా కో ఆర్డినేటర్ నార్పల సత్యనారాయణరెడ్డి, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, సీఈసీ సభ్యులు నదీం అహమ్మద్, మీసాల రంగన్న, కోగటం విజయభాస్కర్ రెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్‌గౌడ్, చిత్తూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్రగా వెళ్తున్న మాజీ ఎంపీ రంగయ్య
కాలువను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే విశ్వ
‘హంద్రీ–నీవా’ లైనింగ్ మాటున ప్రజాధనాన్ని చంద్రబాబు, లోకేష్ లూటీ చేశారు
కుప్పానికి నీరు తరలించడానికి జిల్లా రైతులకు శాశ్వత సమాధి కట్టారు
నిప్పులు చెరిగిన వైఎస్సార్ సీపీ నేతలు
తమ పార్టీ అధికారంలోకి వచ్చాక కాలువ వెడల్పు చేస్తామని స్పష్టీకరణ
వైఎస్సార్ సీపీ పిలుపుతో
కదం తొక్కిన అన్నదాతలు
గ్రేటర్ రాయలసీమ నీటి ప్రాజెక్టుల టాస్క్‌ఫోర్స్ కమిటీ కాలువ పరిశీలన పాదయాత్ర విజయవంతం
ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం
జిల్లాకు గతంలో తుంగభద్ర జలాలు కీలకంగా ఉండేవి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి వచ్చాయి. గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన కోసం వైఎస్సార్ సీపీ టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. రైతులకు అండగా నిలవడమే ఈ కమిటీ లక్ష్యం. చంద్రబాబు ప్రజాకంటక పాలన సాగిస్తున్నారు. రానున్న రోజుల్లో రాయలసీమ వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం ఉద్యమిస్తాం.
–నార్పల సత్యనారాయణరెడ్డి,
గ్రేటర్ రాయలసీమ నీటి ప్రాజెక్టుల సాధన టాస్క్‌ఫోర్స్ కమిటీ జిల్లా కోఆర్డినేటర్
పట్టుకుంటే ఊడిపోయే లైనింగ్
పట్టుకుంటే కూడా ఊడిపోయే స్థితిలో హంద్రీ–నీవా లైనింగ్ ఉంది. వేల కోట్లు ఖర్చు చేశామని, 200 రోజులు నీరు వచ్చిందని చెబుతున్నా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి. డబ్బు మూటలన్నీ అమరావతికి తీసుకెళ్తున్నారు. హంద్రీ–నీవా లైనింగ్‌తో రైతన్న బాగుపడలేదు కానీ కాంట్రాక్టర్లకు మాత్రం రూ. వందల కోట్లు దోచిపెట్టారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్ ముసుగులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి.
– సాకే శైలజనాథ్, మాజీ మంత్రి,
గ్రేటర్ రాయలసీమ నీటి ప్రాజెక్టుల
సాధన టాస్క్‌ఫోర్స్ కమిటీ కన్వీనర్
రైతులకు సమాధి కట్టారు
కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హంద్రీ–నీవా ప్రాజెక్టు చేపట్టారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దూరదృష్టితో గండికోట రిజర్వాయర్‌కు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చారు. గాలేరి, నగరి కాలువను పటిష్టం చేశారు. చంద్రబాబు కేవలం కుప్పం ప్రాంతానికి నీటిని తరలించేందుకు రైతుల ఆశలను అడియాసలు చేశారు. ఈ ప్రాంత రైతులకు శాశ్వత సమాధి కట్టారు. హంద్రీ–నీవా లైనింగ్ వల్ల ఈ ప్రాంతంలో బోర్లు వట్టిపోయి చీనీ, మామిడి చెట్లు ఎండిపోయాయి. – వై. విశ్వేశ్వర రెడ్డి,
వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు
హంద్రీ–నీవా కాలువ వెడల్పు, లైనింగ్ పనులను అత్యంత నాసిరకంగా చేశారు. రూ.3,800 కోట్లు విలువ చేసే పనుల్లో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఎలా దోపిడీ చేశారో స్పష్టంగా కనిపిస్తోంది. కాంట్రాక్టర్లుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. కుప్పానికి నీరు తీసుకెళ్లే క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన అన్నదాతలకు శాశ్వత సమాధి కట్టారు. సక్రమంగా పనులు జరిగి ఉంటే అనంతపురం జిల్లాకు 80 టీఎంసీల నీరు వచ్చేవి, మరి ఆ మేరకు నీళ్లు ఎందుకు రాలేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి వల్లే హంద్రీ–నీవా ప్రాజెక్టు సాధ్యమైంది. కరువు ప్రాంతాలకు కృష్ణా జలాలు తరలించాలన్న ఉద్దేశంతో పనులు శరవేగంగా చేపట్టారు. చంద్రబాబు హంద్రీ–నీవా ప్రాజెక్టును 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు కుదించి తీరని ద్రోహం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటే ఈ సారి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టెండర్లు రద్దు చేసి మళ్లీ 3,850 క్యూసెక్కులకే పరిమితం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే హంద్రీ–నీవాను 11,500 క్యూసెక్కులకు విస్తరిస్తాం. జిల్లా రైతులు ధైర్యంగా ఉండాలి.
–అనంత వెంకటరామిరెడ్డి,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
సీఎం చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి రాజధాని హైదరాబాద్‌ను వదిలేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై నోరు మెదపడం లేదు. హంద్రీ–నీవా ప్రాజెక్టు పనులను నాసిరకంగా చేపట్టి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. దోచుకోవడం.. దాచుకోవడమే చంద్రబాబు సిద్ధాంతం. రాయలసీమకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోం. మన ప్రాంత పరిరక్షణకు ఏకమవుదాం. ఒకరికొకరు సహకరించుకుని పోరాడి సాధించుకుందాం.
– ఎస్వీ మోహన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు


