అనంతపురం అర్బన్: కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. పరిష్కార వేదికలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో భూ సమస్యలపై అర్జీలను అక్కడి అధికారులకు అందజేయాలన్నారు. ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekoram.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు.
స్పందన తెలియజేయండి
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక పనితీరుపై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ కోరారు. ఇందుకోసం క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉచామని చెప్పారు. పరిష్కార వేదికను మరింత పారదర్శకంగా నిర్వహించడంతో పాటు జవాబుదారీతనం పెంచి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టామన్నారు. సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపి అర్జీదారుల సంతృప్తిని మెరుగుపరచడమే లక్ష్యమన్నారు. క్యూఆర్ కోడ్‌ను అన్ని మండల, డివిజన్, జిల్లాస్థాయి కార్యాలయాల వద్ద ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు.
లాకప్ నుంచి
తప్పించుకున్న నిందితుడు
కదిరి టౌన్: ఓ చోరీ కేసులో పట్టుబడిన నిందితుడు పోలీసులనే బురిడీ కొట్టించాడు.ఏకంగా పోలీసుస్టేషన్‌లోని లాకప్ నుంచి పరారయ్యాడు. కదిరి పట్టణ పోలీసుస్టేషన్‌లో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... ఈ మధ్యనే పట్టణంలోని శివాలయంలో హుండీ పగలకొట్టి నగదు చోరీ చేసిన ఘటనలో మేకల నరసింహులు అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పట్టణ పోలీసుస్టేషన్‌లోని లాకప్‌లో ఉంచారు. అయితే పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మేకల నరసింహులు లాకప్ నుంచి పరారయ్యాడు. లాకప్‌కు తాళాలు వేయకపోవడంతో శనివారం మధ్యాహ్నం సమయంలో నిందితుడు సులువుగా తప్పించుకున్నాడని తెలుస్తోంది. విధుల్లో ఉన్న సిబ్బంది ఆ సమయంలో అసలు పోలీసుస్టేషన్‌లో ఉన్నారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.


