పచ్చనేత మరో దుశ్శాసన పర్వం.. వృద్ధురాలి జాకెట్‌ చింపివేత | TDP Leaders Attack On Elderly Women | Sakshi
Sakshi News home page

పచ్చనేత మరో దుశ్శాసన పర్వం.. వృద్ధురాలి జాకెట్‌ చింపివేత

Jul 20 2026 3:53 AM | Updated on Jul 20 2026 5:08 AM

TDP Leaders Attack On Elderly Women

గౌరీశంకర్‌నగర్‌లో దౌర్జన్యం చేస్తున్న తిరుమలేష్, అతని అనుచరులు

16 ఏళ్లుగా ఉంటున్న వృద్ధ దంపతుల ఇంటి దురాక్రమణకు యత్నం

సమ్మెటలు, గడ్డపారలతో వచ్చి ఇంటి చుట్టూ ప్రహరీ కూల్చివేత 

అడ్డుకోబోయిన వృద్ధ మహిళ జాకెట్‌ చింపేసి దారుణం 

వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి ముఖ్య అనుచరుడి అరాచకం 

మిమ్మల్ని చంపేస్తే దిక్కెవరు అంటూ బెదిరింపు 

మొన్న గుంటూరులోనూ మహిళను వివస్త్రను చేసిన టీడీపీ నేత  

రాష్ట్రంలో మహిళలే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ‘పచ్చ’మూకలు  

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: టీడీపీ శ్రేణుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. మహిళలే లక్ష్యంగా అకృత్యాలకు తెగబడుతున్నారు. గుంటూరు నగరంలో టీడీపీ నేత మూర్తి తన అనుచరులతో కలిసి ఓ మహిళను వివస్త్రను చేసిన ఘటన మరువక ముందే.. మరో పచ్చనేత పేట్రేగిపోయాడు. దిక్కూమొక్కూలేని వృద్ధ దంపతుల ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించి.. అడ్డుకున్న ఆ ఇంటి యజమానురాలి జాకెట్‌ను చింపేసిన దారుణ ఘటన వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలులో కలకలం రేపింది. బాధితులు తెలిపిన సమాచా­రం మేరకు వివరాలిలా ఉన్నాయి.

బద్వేలులోని గౌరీశంకర్‌నగర్‌ 1021 సర్వే నంబరులోని 74వ ప్లాట్‌లో వృద్ధ దంపతులు ఇంటిని నిర్మించుకుని 16 ఏళ్లుగా అక్కడే నివాసముంటున్నారు. మూడునెలల కిందట ప్రొద్దుటూరులోని వసంతపేటకు చెందిన కొందరు వ్యక్తులు వచ్చి ‘ఈ స్థలం మాది.. ఇల్లు ఖాళీచేసి వెళ్లిపొండి’.. అంటూ దౌర్జన్యానికి దిగారు. అప్పట్లో స్థానిక మహిళలు గట్టిగా వారించడంతో వారు వెళ్లిపోయారు. తిరిగి శనివారం ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తులకు వత్తాసుగా కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి ముఖ్య అనుచరుడు, తెలుగునాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్‌ తన అనుచరగణంతో సమ్మెటలు, గడ్డపారలు తీసుకొచ్చి ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీని పడగొట్టారు.

దాదాపు అరగంట సేపు నానా బీభత్సం సృష్టించారు. అడ్డుకోబోయిన వృద్ధురాలైన ఇంటియజమానిని తోసేసి ఆమె జాకెట్‌ చింపి దాడికి యత్నించారు. ఇంతలో చుట్టుపక్కల మహిళలు అక్కడికి వచ్చి వారిని అడ్డుకున్నారు. 16 ఏళ్లుగా ఇక్కడే నివాసముంటున్న దిక్కూమొక్కూ లేని ఆ వృద్ధదంపతుల పట్ల దౌర్జన్యాన్ని నిలదీశారు. వృద్ధురాలి జాకెట్‌ చించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు.  

నా భార్య జాకెట్‌ చింపేసి.. ఆత్మాభిమానాన్ని మంటగలిపారు.. 
16 ఏళ్లుగా గౌరీశంకర్‌నగర్‌లో చిన్న ఇల్లు నిర్మించుకుని ఉంటున్నాం. బొజ్జా తిరుమలేష్, అనుచరగణం పూటుగా మద్యం తాగి రెండు కార్లలో సమ్మెటలు, గడ్డపారలతో వచ్చి ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన నా భార్యపై దాడికి యత్నించి జాకెట్‌ చింపేశారు. మిమ్మల్ని చంపితే దిక్కెవరంటూ నానా బీభత్సం సృష్టించారు. మాపై దాడికి పాల్పడి.. నా భార్య జాకెట్‌ చింపేసి మా ఆత్మగౌరవాన్ని మంటకలిపిన వారిపై చర్యలు తీసుకోవాలి.  – వృద్ధురాలి భర్త, బద్వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement