సాయికృష్ణ లాకప్‌డెత్‌ కథ కంచికే! | TDP MLA Gadde Rammohan attended the funeral rites of Gade Saikrishna | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ లాకప్‌డెత్‌ కథ కంచికే!

Jul 20 2026 4:19 AM | Updated on Jul 20 2026 4:19 AM

TDP MLA Gadde Rammohan attended the funeral rites of Gade Saikrishna

సాయికృష్ణ చిత్ర పటం వద్ద అతని తల్లి విజయలక్ష్మి, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

బూడిద లేకుండానే కర్మకాండలు పూర్తి 

హాజరైన టీడీపీ ఎమ్మెల్యే గద్దె 

ముందుకు సాగని సిట్‌ విచారణ 

కేసును నీరుగార్చే కుట్రలు  

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసు కథ కంచికి చేరినట్లే కనిపిస్తోంది! సాయికృష్ణ చనిపోయిన తేదీ, కనీసం బూడిద ఆనవాళ్లు కూడా లేకుండానే కుటుంబ సభ్యులు విజయవాడ కృష్ణలంకలోని సత్యంగారి దొడ్డిలో ఆదివారం కర్మకాండలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఈస్ట్‌ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ హాజరు కావడం గమనార్హం. చనిపోయిన మూడు నెలల్లోగా పెద్ద కర్మ నిర్వహించకుంటే తమ కుటుంబానికి కీడు కలుగుతుందని, అందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని బంధువులు తెలిపారు.

అయితే తెరవెనుక ఈ కేసును నీరు గార్చే కుట్రలు దాగి ఉన్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం నియమించిన సిట్‌ సైతం సాయికృష్ణది లాకప్‌ డెత్‌ అని నిర్ధారించినా ఎప్పుడు చనిపోయాడు? శవం ఏమైంది? అనే విషయాలను ఇప్పటికీ తేల్చలేదని గుర్తు చేస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడు నాగరాజును కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టుల్లో పిటీషన్లు వేస్తూ కాలయాపన చేయడం మినహా సాధించింది శూన్యమంటున్నారు.  

తూతూ మంత్రంగా విచారణ.. 
సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో సిట్‌ విచారణ తూతూ మంత్రంగా సాగుతోంది. రోజులు గడిచిపోతున్నా అడుగు ముందుకు పడటం లేదు. ప్రధాన నిందితుడు నాగరాజు, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్‌ అరెస్టు మినహా కేసులో పురోగతి లేదు. నాగరాజు కస్టడీపై విచారణ ఆగస్టు 14కు వాయిదా పడింది. సీసీ ఫుటేజీ రికవరీకి సంబంధించి పిటిషన్ల విచారణలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఈ కేసును పక్కా ప్రణాళికతో నీరుగార్చే కుట్రలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.

తొలుత సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జూన్‌ 18న ఆ కుటుంబాన్ని పరామర్శించడంతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం సీఐ నాగరాజును సస్పెండ్‌ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేసింది. ప్రభుత్వం తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంకావడంతో ఐజీ నేతృత్వలో సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే సిట్‌ దర్యాప్తు సాగదీత దిశగానే సాగుతోంది. పోలీసు స్టేషన్‌ టెర్రస్‌పై బూడిద, ఎముకలు, సగం కాలిన లాఠీ, గొలుసు లభించాయని కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది.

అవి సాయికృష్ణవేనా? అనే విషయాన్ని తేల్చలేదు. ఇక సాయికృష్ణ ఫోన్‌ను గోవాకు తీసుకెళ్లినట్లు లీకులు ఇచ్చారు. ఈ కేసులో ఏ4 ఎవరు? అనే విషయాన్ని వెల్లడించలేదు. ఒకవైపు ఇలా తీరుతెన్ను లేకుండా దర్యాప్తు జరుగుతుండగా... మరోవైపు బూడిద కూడా లేకుండానే మృతుడి కుటుంబ సభ్యులు పెద్దకర్మ చేయడంతో సాయికృష్ణ కథ కంచికి చేరినట్లేననే పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement