మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎటువంటి షరతులు లేని మహిళా బిల్లును ఆమోదించాలని మహిళా సంఘాల ఐక్యవేదిక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లెనిన్ సెంటర్‌లో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర నాయకురాలు రమాదేవి, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు పద్మ మాట్లాడుతూ.. 2023లో భారత రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మహిళా రిజర్వేషన్‌కు కేంద్రం చట్టబద్ధత కల్పించిందన్నారు. జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు వాయిదా వేయడం ద్వారా మహిళలకు తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణన, డీలిమిటేషన్ షరతులు లేకపోయి ఉంటే ప్రస్తుతం లోక్ సభలో మహిళల ప్రాతినిధ్యం 33శాతం ఉండేదన్నారు. దశాబ్దాలుగా మహిళా ఉద్యమాలు సాగించిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఈ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తాత్సారం చేయడం మహిళల రాజకీయ సాధికారతను అడ్డుకోవడమేనన్నారు.. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్ వంటి వివాదాస్పద అంశాలతో ముడిపెట్టకుండా వర్షాకాల సమావేశాలలో షరతులు లేని మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుర్గ కోటేశ్వరావు, బంకా ఝాన్సీ, నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి, ఐద్వా జిల్లా నాయకురాలు శ్రీదేవి, మహిళా సంఘాల నాయకురాళ్లు దుర్గాసి రమణమ్మ , దుగ్గిరాల సీతారావమ్మ, అనిత, అండమని నాగమణి, ఆర్. అనసూయ, రాజ్యలక్ష్మి, గుణసుందరి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.


