కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిషేధిత భూముల (22–ఏ) జాబితాలో పొరపాటున నమోదైన భూములకు సంబంధించి పట్టాదారులకు సత్వర న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ప్రతి దరఖాస్తును పారదర్శకంగా, చట్టబద్ధంగా, వేగవంతంగా పరిశీలిస్తూ 22(ఏ) కేసుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. 22ఏ నుంచి తొలగించి భూ యాజమాన్య హక్కుల పునరుద్ధరణకు సంబంధించి సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ 10 మంది భూ యజమానులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 22(ఏ) కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు పరిష్కారమైన కేసులకు సంబంధించి అర్జీదారులకు పత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు. గత మూడు నెలల కాలంలోనే 62 ఎకరాలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టు తెలిపారు.
చెస్‌లో జిల్లా క్రీడాకారులకు బంగారు పతకాలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ పి.రేణుక ఉమెన్ క్యాటగిరీలో 4.5 పాయింట్లు సాధించి బెస్ట్ ఉమెన్ ప్లేయర్ అవార్డుతో పాటు ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిందని ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్ పాషా చెప్పారు. స్థానిక చుట్టుగుంటలోని ఎస్‌ఆర్‌ఆర్ చెస్ అకాడమీ ఆవరణలో పతకాలు పొందిన క్రీడాకారులను సోమవారం ఆయన అభినందించారు. ఈ నెల 18, 19 తేదీల్లో నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో బాలికల అండర్ –7 కేటగిరిలో గోలి అతిథి శ్రేయ ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుందన్నారు. చెస్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులతో పాటుగా చెస్ క్రీడాకారులు పాల్గొని పతకాలు పొందిన రేణుక, గోలి అతిథి శ్రేయలను అభినందించారు.


