గన్నవరం: యూ ట్యూబర్ ప్రశ్న రావణ్ కస్టడీ కోరుతూ గన్నవరం కోర్టులో పోలీసులు దాఖలు చేసిన పిటీషన్‌పై అతని తరఫున న్యాయవాదులు సోమవారం కౌంటర్ దాఖలు చేశారు. ఉపా తదితర సెక్షన్ల కింద నమోదైన కేసులో ప్రశ్న రావణ్ ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అతనిని 15 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఇటీవల గన్నవరం పోలీసులు స్థానిక 12వ అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రావణ్ తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాది తిరివీధి వెంకయ్య కౌంటర్ దాఖలు చేశారు. దీంతో కస్టడీ పిటీషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
కుటుంబ మనస్పర్థలతో
వ్యక్తి ఆత్మహత్య
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్):
రైల్వేస్టేషన్ సమీపంలో ఉరి వేసుకుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై ఎస్‌ఎన్‌పురం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం దెబ్రత చౌదరి(39) భార్య, కుమార్తెతో కలసి పశ్చిమబెంగాల్ రాష్ట్రం పార్గాణాస్ జిల్లాలోని సెరబేరియా గ్రామంలో నివాసముంటున్నాడు. కుటుంబంలో మనస్పర్థల కారణంగా అతను ఇల్లు విడిచి విజయవాడ చేరుకుని తాపీ పనులు చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నాడు. ఇటీవల రైల్వేస్టేషన్ ఎదుట నిర్మాణంలో ఉన్న భవనంలో తాపీ పనులు చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తాను పనిచేసే ప్రాంతంలోనే ఇనుప స్తంభానికి తాడుతో ఉరి వేసుకుని మృతిచెందాడు. చుట్టుపక్కల వారు చూసి కిందికి దింపగా అప్పటికే మృతిచెందాడు. సైట్ ఇంజినీర్ వేముల కాళీప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబ మనస్పర్థల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎయిర్‌పోర్ట్‌లో పవన్‌కళ్యాణ్‌కు స్వాగతం
గన్నవరం: శస్త్రచికిత్స అనంతరం డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సోమవారం రాష్ట్రానికి విచ్చేశారు. తొలుత హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు పలువురు అధికారులు, జనసేన పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.


