వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్యాణి మహిళపై దాడిచేసి వివస్త్రను చేసినందుకు వైఎస్సార్ సీపీ నిరసన కూటమి ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలంటూ అంబేడ్కర్‌కు వినతి
హోం మంత్రి రాజీనామా చేయాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళల రక్షణను గాలికి వదిలేసిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో టీడీపీ నాయకుడు మల్లెల మూర్తి కొంత మంది హిజ్రాలతో కలిసి ఒక మహిళపై దాడి చేసి వివస్త్రను చేసినందుకు నిరసనగా వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దగల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
పవన్ ఎక్కడ ఉన్నారు?
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మేయర్ రాయన భ్యాలక్ష్మి మాట్లాడుతూ లంచం ఇవ్వకపోతే మహిళలను వివస్త్ర చేసి, హత్యాయత్నం చేసే కొత్త సంస్కృతికి టీడీపీ శ్రీకారం చుట్టిందన్నారు. నడి రోడ్డులో ఆ మహిళకు జరిగిన అవమానాన్ని చంద్రబాబు, హోం మంత్రి అనిత పూడ్చగలరా అని నిలదీశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పే వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదంటే పోలీస్ వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు. గుంటూరు ఘటనకు సంబంధించి మహిళను పరామర్శించాల్సిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజ వీడియోలు ఎలా బయటకు వచ్చాయని ఆరా తీయడం ఆడతనానికే మాయని మచ్చ అన్నారు.
ఎమ్మెల్సీ కల్యాణి మాట్లాడుతూ మైలవరంలో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ మహిళపై దాడి చేశారని, నెల్లూరులో గిరిజన మహిళపై దాడి చేశారని, చంద్రబాబు సొంత జిల్లాలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి హింసించారని ఇలా రాష్ట్రంలో మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా హోం మంత్రి ఎక్కడ దాక్కున్నారని మండిపడ్డారు. సినీ నటి జత్వాని విషయంలో కూటమి ప్రభుత్వం ఎస్కార్ట్ ఇచ్చి మరీ రాచమర్యాదలు చేసిందని, ఇది సరి కాదని ఆనాడే చెప్పామని, తాము చెప్పిందే ఈ రోజు నిజమైందని తెలిపారు. గుంటూరు ఘటనపై స్పందించని హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


