పాత ప్రభుత్వాస్పత్రిలో అందుబాటులోకి క్రిటికల్ కేర్ బ్లాక్ గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సాయంతో నిర్మాణానికి శ్రీకారం అంతకు ముందు నిధుల్లేక మధ్యలో వదిలేసిన టీడీపీ ప్రభుత్వం
వైద్యులు, సిబ్బందిని నియమించాలి
వైఎస్సార్ సీపీ హయాంలోనే..
ఫలించిన ముందు చూపు..
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో చేపట్టిన నిర్మాణాలు ఇప్పుడు ఎంతో ప్రయోజనకరంగా మారుతు న్నాయి. ముఖ్యంగా వైద్య రంగంలో అనేక సంస్కర ణలు చేపట్టారు. అందులో భాగంగా పరిమితిలేని విధంగా నిధులు మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారిపోయాయి. నాడు నిధులు కేటాయించి చేపట్టిన నిర్మాణాలు ఒక్కొక్కటీగా అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో విజయవాడ పాత ఆస్పత్రి ప్రాంగణంలో చేపట్టిన క్రిటికల్ కేర్ విభాగం ఒకటి. దీనిని సుమారు రూ.25 కోట్లతో కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో నిర్మించారు. ఇది అందుబాటులోకి రావడంతో అక్కడ ఉన్న ప్రసూతి విభాగంలోని గర్భి ణులకు ఎంతో మేలు చేకూరనుంది.
నాడు కేంద్ర మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అత్యాధునిక వసతులతో మూడు క్రిటికల్ కేర్ సెంటర్‌లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతిచ్చింది. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి విజయవాడ పాత ఆస్పత్రి ప్రాంగణంలో ఒక క్రిటికల్ కేర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అప్పటి కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ 2023 చివర్లో ఈ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వేగంగా పనులు చేయడంతో ఎన్నికల నాటికే దాదాపు 50 శాతం నిర్మాణం పూర్తయింది. మిగిలిన పనులు రెండేళ్లుగా సాగి ప్రస్తుతం అందుబాటులోకి రానుంది.
అదనపు యూనిట్లు మంజూరు
పాత ఆస్పత్రిలోని గైనాకలజీ విభాగంలో గతంలో మూడు యూనిట్లు మాత్రమే ఉండేవి. వాటిలో 90 పడకలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పెద్ద సంఖ్యలో గర్భిణిలు రావడంతో వైద్యులు, సిబ్బందిపై పని వత్తిడి బాగా ఉండేది. అంతేకాదు ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు గర్భిణులు ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో 2014–19లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రెండు పర్యాయాలు ప్రసూతి విభాగాన్ని సందర్శించారు. అక్కడ గర్భిణుల ఇబ్బందులు చూసి సమస్య పరిష్కరిస్తామన్నారు. అయితే ఏమి చేయ లేదు. రాష్ట్రంలో 2019వ సంవత్సరంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడంతో వెంటనే మూడు యూనిట్‌లు మంజూరు చేశారు. దీంతో మరో 90 పడకలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు కొత్తగా ఏర్పాటైన యూనిట్లుకు వైద్యులు, సిబ్బందిని కూడా మంజూరు చేశారు. దీంతో కొంత వరకూ సమస్య తీరింది.
గతంలో నిలిచిన ప్రసూతి బ్లాక్ నిర్మాణం
2014–19 మధ్యలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో రూ.18 కోట్లతో ప్రసూతి బ్లాక్ నిర్మాణం చేపట్టాలని భావించింది. అందుకోసం భూమిపూజ చేసి పెద్ద రాళ్లపై పేర్లు వేసుకుంది. నిధులు కేటాయించక పోవడంతో పునాదుల మీదే నిర్మాణాలు నిలిచిపోయాయి. ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారిని ఆ పునాదులు చానాళ్లు వెక్కిరిస్తూ కనిపించాయి.
క్రిటికల్ కేర్ భవనం నిర్మాణంతో మరిన్ని పడకలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రభుత్వం మరిన్ని యూనిట్లు మంజూరు చేస్తేనే ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే పడకలు పెరిగినా వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకుండా చేసేదేమీ లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం క్రిటికల్ కేర్ భవనంలో సౌకర్యాలు కల్పించి వెంటనే అందుబాటులోకి తేవాలని, వసరమైన వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే పాత ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఎన్నికల నాటికే సగం నిర్మాణం పూర్తయింది. నిధులు ఉన్నా పూర్తి చేసేందుకు రెండేళ్లు పట్టింది. ఇప్పటికై నా ఈ విభాగాన్ని అందుబాటులోకి తీసుకు రావాలి. గర్భిణుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. కూటమి పాలనలో ప్రభుత్వ వైద్యం పూర్తిగా నిర్వీర్యమైంది. రోగుల కష్టాలు పట్టడం లేదు. ప్రభుత్వాస్పత్రిపై దృష్టి పెట్టాలి.
– మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే


