అర్జీదారులకు భరోసాగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీదారులకు భరోసాగా నిలవాలి

Jul 21 2026 2:00 AM | Updated on Jul 21 2026 2:00 AM

అర్జీదారులకు భరోసాగా నిలవాలి

పీజీఆర్‌ఎస్‌ అర్జీలను సత్వరం పరిష్కరించాలి సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): పీజీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చే అర్జీల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం జరిగింది. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియతో కలిసి కలెక్టర్‌ లక్ష్మీశ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో పెండింగ్‌, పరిష్కరించిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఒకసారి పరిష్కారం చూపిన తర్వాత ఫిర్యాదు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి రాకూడదన్నారు. ఆ దిశగా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టంచేశారు. ఫిర్యాదుదారుడు పూర్తిగా సంతృప్తి చెందేలా ఆ పరిష్కారం ఉండాలన్నారు. సమస్యలు వెంటనే పరిష్కరించలేని పరిస్థితుల్లో అందుకు గల కారణాలను స్పష్టంగా వివరించి అర్జీదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి అర్జీని పూర్తిగా పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి నాణ్యమైన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 251 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్‌ తెలిపారు. పీజీఆర్‌ఎస్‌ సేవలపై క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ప్రజలు తమ ప్రజాభిప్రాయం తెలపా లని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహ, పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

శివయ్య చెరువును కాపాడాలని వినతి

జి.కొండూరు మండలం, కడిమి పోతవరం గ్రామంలోని శివయ్య చెరువును కబ్జా కోరల నుంచి కాపాడాలని ఆ గ్రామ రైతులు బి.కృష్ణారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు పీజీఆర్‌ఎస్‌లో జేసీకి అర్జీ అందజేశారు. మైనింగ్‌ చేస్తున్న కొందరు చెరువును ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెరువు ఆక్రమణల కారణంగా తాగు, సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని, కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement