కృష్ణాజిల్లాలో ఘటన
చల్లపల్లి: తాను ఏరోజైతే బిడ్డకు జన్మనిచ్చిందో అదే రోజు ఆ తల్లి కొడుకుని కొట్టి చంపింది. మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పింది. కృష్ణాజిల్లా, చల్లపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చల్లపల్లి పడమర వీధిలో నివాసం ఉంటున్న మోతుకూరి నాగమణికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు శివ ఏసీ రిపేర్ పని చేసుకుంటూ కొన్నేళ్లుగా దూరంగా వేరే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. నాగమణి పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్(35) వద్దే ఉంటోంది. అతడు ముఠాపని, డెలివరీ బాయ్‌గా పని చేస్తుంటాడు. మద్యానికి బానిసైన దుర్గాప్రసాద్ తరచూ తల్లితో గొడవపడేవాడు.
ఇదే క్రమంలో సోమవారం రాత్రి కూడా ఇంట్లో తల్లీకొడుకులు ఇద్దరూ వాదులాడుకున్నారు. తెల్లారిన తరువాత నాగమణి తన పనులు చేసుకుంటూ ఇరుగుపొరుగు వారితో సాధారణంగానే మాట్లాడింది. 10.30 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. రాత్రి తాను, తన కొడుకు దుర్గాప్రసాద్ గొడవ పడ్డామని, సహనం నశించి బలమైన వస్తువుతో కొట్టగా తన కొడుకు చనిపోయాడని పోలీసులకు చెప్పింది. అవాక్కయిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా దుర్గాప్రసాద్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు.
తలపై ఇనుప రాడ్డుతో కొట్టిన గాయాలు ఏడు నుంచి తొమ్మిది వరకూ గాట్లు ఉన్నట్లు తెలిసింది. చల్లపల్లి పోలీసులు వివరాలు, ఆధారాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేశారు. మృతుడు దుర్గాప్రసాద్ ఫేస్‌బుక్ అకౌంట్లో దొరికిన వివరాలను బట్టి అతను జూలై 20, 1991న జన్మించాడు. పుట్టిన రోజునాడే జన్మనిచ్చిన తల్లి చేతిలోనే దుర్గాప్రసాద్ హతమయ్యాడు.


