న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజీనామా లేఖ ఎలా రాయాలో ఆయనకు బహుశా తెలియదని ఆమె ఎద్దేవా చేశారు. నీట్ పరీక్షల్లో అక్రమాలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి.
పార్లమెంట్ వైపు సాగిన ‘చలో సంసద్’ మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు జరిపిన లాఠీచార్జిపై ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ధర్మేంద్ర ప్రధాన్‌ను రక్షించడం కోసమే ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగిస్తోందని, ఇరవై మందికి పైగా విద్యార్థుల మరణాలకు ఆయనే బాధ్యుడని సీజేపీ ఆరోపించింది. మరోవైపు కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష 24వ రోజుకు చేరుకుంది. భద్రతా సిబ్బంది ఆంక్షలు, భారీ వర్షాన్ని లెక్కచేయకుండా వాలంటీర్లు ఆందోళన స్థలాన్ని శుభ్రం చేస్తూ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై రాజకీయ ఒత్తిడి మరింత పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: ‘వాంగ్‌చుక్‌కు ఏమైనా జరిగితే..’.. కాంగ్రెస్ ఎంపీ హెచ్చరిక


