ఒక పరీక్ష.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్.. కోట్లాది కుటుంబాల ఆశలు. అలాంటి పరీక్షా వ్యవస్థలో చిన్న లోపం జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మరి దేశంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్-యూజీలో ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యత ఎవరిది? లీక్‌కు పాల్పడిన వ్యక్తులదా? లేక ఆ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న మంత్రిదా?..
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ అటు నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాల నుంచి బలంగా వినిపిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్‌ను తోసిపుచ్చుతోంది. ప్రశ్నపత్రం లీక్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని, పరీక్షా వ్యవస్థలో మున్ముందు ఈ తరహావి జరగకుండా సంస్కరణలు చేపడుతున్నామని చెబుతోంది.
అయితే ఇక్కడ అసలు ప్రశ్న.. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలి?. ఆయనేమైనా పేపర్ లీక్ చేశారా?. ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవు కదా అని!. కానీ.. తన శాఖ పరిధిలో ఇంత పెద్ద స్థాయిలో వ్యవస్థాపరమైన వైఫల్యం చోటుచేసుకున్నప్పుడు నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదా? అంటూ ఇంకోవైపు కూడా ఒత్తిడి నెలకొంది.
నైతిక బాధ్యతా?.. పెద్ద మాటే!
రాజకీయాల్లో “నైతిక బాధ్యత” అనేది చట్టపరమైన నేరంతో సమానం కాదు. ఒక మంత్రి స్వయంగా తప్పు చేశారని నిరూపణ కాకపోయినా.. తన శాఖలో జరిగిన తీవ్రమైన వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవడం అనే సంప్రదాయం భారత రాజకీయాల్లో గతంలో కనిపించింది. అయితే కాలంతో పాటు ఈ సంప్రదాయంపై అభిప్రాయాలు మారాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు సాధారణంగా.. “తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం, దర్యాప్తు పూర్తి చేయడం, వ్యవస్థను సరిదిద్దడం”నే బాధ్యతగా చెబుతున్నాయి. ఇదే నీట్ వివాదంలోనూ కేంద్రం వాదన.
గతం ఏం నేర్పింది మరి?
నీట్ వ్యవహారంలో మరో కీలక ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. 2024లోనూ నీట్-యూజీ నిర్వహణపై తీవ్ర వివాదం చెలరేగింది. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదం, పరీక్షా విధానంపై అనుమానాలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీశాయి. ఆ సమయంలోనూ కేంద్ర విద్యాశాఖపై ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు ధర్మేంద్ర ప్రదానే మంత్రిగా ఉన్నారు.
ఇప్పుడు మళ్లీ నీట్ వ్యవస్థపై నమ్మకం దెబ్బతినడంతో.. “గత వివాదాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు? వ్యవస్థలో లోపాలు ఎందుకు పునరావృతమవుతున్నాయి?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మరోవైపు నీట్ వివాదాల నేపథ్యంలో కొందరు విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, ఆందోళనలకు లోనై అఘాయిత్యాలకు పాల్పడ్డారని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో.. పరీక్షా వ్యవస్థపై విశ్వాసాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు చెబుతున్నారు.
అయితే కేంద్రం వాదన మాత్రం భిన్నంగా ఉంది. లీకో, అవకతవకలో.. పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా సంస్కరణలు తీసుకురావడమే అసలు బాధ్యత అని ప్రభుత్వం చెబుతోంది.
గతంలో నైతిక బాధ్యతతో పదవి వదిలిన నేతల గురించి తెలుసా?.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్న వీళ్లు పేర్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి మరి!.
లాల్ బహదూర్ శాస్త్రి..
స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో నైతిక బాధ్యతకు తొలి ఉదాహరణగా తరచూ ప్రస్తావించే పేరు లాల్ బహదూర్ శాస్త్రి. 1956లో తమిళనాడులోని అరియలూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదానికి శాస్త్రి ప్రత్యక్షంగా కారణం కాదు. అయినప్పటికీ రైల్వే మంత్రిగా శాఖ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తొలుత ఆయన నిర్ణయాన్ని అంగీకరించకపోయినా.. శాస్త్రి పట్టుదలతో చివరకు రాజీనామాను ఆమోదించారు.
టీటీ కృష్ణమాచారి..
1958లో వెలుగులోకి వచ్చిన ముండ్రా కుంభకోణం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఎల్‌ఐసీ పెట్టుబడుల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు, ఆర్థిక శాఖపై వచ్చిన విమర్శల నేపథ్యంలో అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో తన శాఖపై వచ్చిన బాధ్యతను స్వీకరిస్తూ ఆయన పదవికి రాజీనామా చేశారు. ఇది కూడా నైతిక బాధ్యతకు ఉదాహరణగా చెప్పబడుతుంది.
మాధవరావ్ సింధియా..
1992లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదం అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి మాధవరావ్ సింధియా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ప్రమాదానికి ఆయన ప్రత్యక్ష కారణం కాకపోయినా.. శాఖ మంత్రిగా వ్యవస్థాపరమైన లోపాలకు బాధ్యత వహించడం రాజకీయాల్లో నైతిక ప్రమాణంగా నిలిచింది.
నితీశ్ కుమార్.. గైసాల్ రైలు ప్రమాదం
1999లో పశ్చిమ బెంగాల్‌లోని గైసాల్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వందలాది మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి రైల్వే మంత్రి నితీశ్ కుమార్.. ప్రమాదానికి తాను ప్రత్యక్ష కారణం కాకపోయినా, రైల్వే శాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.
జార్జ్ ఫెర్నాండెజ్..
2001లో తెహల్కా నిర్వహించిన ‘ఆపరేషన్ వెస్ట్ ఎండ్’ స్టింగ్ ఆపరేషన్ రక్షణ శాఖలో అవినీతి ఆరోపణలకు దారితీసింది. ఈ వ్యవహారంపై తీవ్ర రాజకీయ దుమారం రేగడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ రాజీనామా చేశారు. తర్వాత ఆయన తిరిగి కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినప్పటికీ.. ఆ సమయంలో రక్షణ శాఖపై వచ్చిన ఆరోపణలకు రాజకీయ బాధ్యత వహించిన ఘటనగా ఇది నిలిచింది.
ప్రతి వైఫల్యానికి రాజీనామా జరిగిందా?
అలా ఏం జరగలేదు. భారత రాజకీయ చరిత్రలో ప్రతి పరిపాలనా వైఫల్యానికి మంత్రి పదవి వదిలిన సందర్భాలు లేవు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు దర్యాప్తులు, కమిటీలు, సంస్కరణలతో ముందుకు వెళ్లాయి. అందుకే ఇప్పుడు నీట్ వివాదంలోనూ రెండు వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం వాదన ప్రకారం.. లీక్‌కు పాల్పడిన వ్యక్తులు గుర్తించబడ్డారు. అరెస్టులు జరిగాయి. దర్యాప్తు కొనసాగుతోంది. ఒక నేరానికి పాల్పడిన వ్యక్తుల చర్యలకు మంత్రిని నేరుగా బాధ్యుడిని చేయడం సరైన విధానం కాదని కేంద్రం చెబుతోంది.
మరోవైపు ఆందోళనకారులు, ప్రతిపక్షాల వాదన మాత్రం వేరుగా ఉంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసం దెబ్బతిన్నప్పుడు.. వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న మంత్రి నైతిక బాధ్యత తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నీట్ వివాదం.. అసలు పరీక్ష ఎవరికంటే?
నీట్ లీక్ వివాదం చివరకు ఒక మంత్రి పదవి ప్రశ్నకే పరిమితం కాదు. దేశంలోని పరీక్షా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మిస్తారు? భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి భరోసా ఇస్తారు? అన్నదే అసలు సవాల్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? లేదా అన్నది రాజకీయ నిర్ణయం. కానీ “ఒక వ్యవస్థ విఫలమైతే.. దాని అధిపతి ఎంతవరకు బాధ్యత వహించాలి?” అనే పాత ప్రశ్నను నీట్ వివాదం భారత రాజకీయాల్లో మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.
::వెబ్ ప్రత్యేకం


