నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యా సంస్కరణలు.. అలాగే నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. ఓ టాపర్ మాత్రం భిన్నమైన నిర్ణయం తీసుకున్నాడు. తోటి విద్యార్థుల్లా నిరసనల్లో పాల్గొనడం కంటే.. మళ్లీ పరీక్ష రాసి ర్యాంక్ కొట్టడంపైనే ఫుల్‌గా ఫోకస్ పెట్టాడు. అంతేకాదు ఆ ప్రయత్నంలో విజయమూ సాధించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అతని స్పందన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
NEET-UG 2026 రీ ఎగ్జామినేషన్‌లో ఆల్ ఇండియా ర్యాంక్-2 సాధించిన పంషుల్ బన్సల్ తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా ఆ సమయంలో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులకు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. నిరసనకు ఎందుకు వెళ్లాలి? దాని బదులు ఇంట్లో చదువుకుని స్కోర్‌ను మెరుగుపరుచుకోవచ్చు కదా అని తాను అనుకున్నానని చెబుతున్నాడు.
మొదట నేనూ బాధపడ్డా..
ఢిల్లీ గ్రేటర్ కైలాష్‌లోని కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్ విద్యార్థి అయిన పంషుల్.. మొదటి NEET పరీక్ష రద్దు కావడంతో తొలుత తీవ్ర నిరాశకు గురయ్యాడట. "మొదట బాధగా అనిపించింది. నేను బాగా రాశానని, మెడికల్ సీటు వస్తుందని అనుకున్నాను. కాసేపటికి దీనినే మరో అవకాశం లాగా మార్చుకోవాలనుకున్నా. ఆ ఫలితం ఆధారంగా నా పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్నాను" అని తెలిపాడు.
706 నుంచి 715 మార్కులకు..
నీట్ మొదటి పరీక్షలో పంషుల్ 706 మార్కులు సాధించాడు. అయితే రీ ఎగ్జామినేషన్‌లో అతని స్కోర్‌ను 715 మార్కులు. ఎగ్జామ్‌లో 99.9999 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా రెండో ర్యాంక్ సాధించాడు. ఈ విజయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందనలు కూడా తెలియజేశారు. అదనంగా లభించిన సమయాన్ని కొత్తగా చదవడానికి కాకుండా.. తన పాత ప్రణాళికనే మరింత క్రమశిక్షణతో కొనసాగించానని చెప్పాడు. "నా షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇదే రొటీన్‌ను కొనసాగించాను. చివరి నెలన్నరలో చేయగలిగినంత కష్టపడ్డాను. మిగతాది దేవుడిపై వదిలేశాను" అని పంషుల్ తెలిపాడు.

నిరసనలపై నో కామెంట్
NEET పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇప్పుడు నిరసనలపై తన అభిప్రాయం చెప్పాలని అడిగినప్పుడు.. పంషుల్ స్పందించేందుకు నిరాకరించాడు. "దానిపై నేను వ్యాఖ్యానించను" అని స్పష్టం చేశాడు.
#NDTVExclusive | "I thought of the situation as an opportunity to improve my score. So I thought, why should I go to the protest? Instead I could be studying at home and improving my skill and score": NEET UG 2026 topper Panshul Bansal to NDTV's @ShivAroor on #IndiaMatters pic.twitter.com/G8c7O2KXHn
— NDTV (@ndtv) July 21, 2026
పేపర్ లీక్ తర్వాత రీ ఎగ్జామ్
అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన NEET-UG పరీక్షను తొలుత మే 3న నిర్వహించారు. అయితే ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న పరీక్షను రద్దు చేశారు. అనంతరం జూన్ 21న భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య రీ ఎగ్జామ్ నిర్వహించి.. జులై 16న ఫలితాలు ప్రకటించారు.
అయితే పంషుల్ బన్సల్ విజయ ప్రయాణంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు తన లక్ష్యంపై దృష్టి పెట్టి ర్యాంక్ సాధించిన అతని కృషిని పలువురు ప్రశంసిస్తుండగా.. మరోవైపు NEET వివాదంలో ఆందోళన చేస్తున్న విద్యార్థుల పరిస్థితులను కొందరు గుర్తు చేస్తున్నారు.
పంషుల్ వంటి సౌకర్యాలు ఉన్న విద్యార్థులకు మరో అవకాశం లభించడం ఒక కోణమైతే.. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు పరీక్షా వ్యవస్థలోని లోపాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళనకారులు చెబుతున్నారు. పేపర్ లీక్ వ్యవహారం ఇప్పటికే ఒత్తిళ్లతో ఉన్న విద్యార్థుల్లో అసంతృప్తికి చివరి కారణంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


