తెలంగాణ అసోసియేషన్ ఎన్‌ఆర్‌ఐ హ్యాంబర్గ్ (TANH) ఆధ్వర్యంలో జర్మనీలోని హ్యాంబర్గ్ నగరంలో తొలిసారిగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనం సమర్పణ, డప్పు వాయిద్యాలు, లాస్య నృత్యాలు తదితర సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించగా, తెలంగాణ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ అధ్యక్షులు డాక్టర్ రఘు చాలిగంటి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లోని తెలంగాణ సంఘాలు కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అందించడంతో పాటు, జర్మనీకి వచ్చే తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగార్థులకు మార్గదర్శకత్వం, వృత్తిపరమైన సహకారం అందించాలని సూచించారు.
హ్యాంబర్గ్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు అందించిన ఆత్మీయ ఆతిథ్యాన్ని ఆయన అభినందిస్తూ, జర్మనీలోని అన్ని నగరాల్లో ఇలాంటి బోనాల వేడుకలు నిర్వహించాలని, అలాగే ప్రతి ఏడాది ఒక నగరంలో తెలంగాణ కుటుంబాల కోసం “Meet & Greet” కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీనివాస్ బసవరాజు నాయకత్వాన్ని అభినందించిన ఆయన, హ్యాంబర్గ్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటుకు కృషి చేసిన అంపన్న రెడ్డి వుటుకూరి, రాహుల్ తుల, ఉదయ్ రెడ్డి కుడుముల, వినీత్ రెడ్డి, సత్యనారాయణ, రామ్ తదితర నిర్వాహకులు, వాలంటీర్ల సేవలను ప్రశంసించారు.
(చదవండి: సాధారణ బైక్ నుంచి బీఎండబ్ల్యూ రేంజ్‌కి..! వైరల్‌గా ఎన్నారై పోస్ట్)


