మృతి చెందిన హఫీజ్ ఉమర్ షేక్ , తీవ్రంగా గాయపడిన షేక్ అబ్దుల్ నవీద్
తల్లి, కొడుకు, కూతురు దుర్మరణం
తండ్రి, చిన్న కుమార్తెకు తీవ్ర గాయాలు
సైదాబాద్‌కు చెందిన కుటుంబం విహారయాత్రకు వెళ్తుండగా దుర్ఘటన
సైదాబాద్ (హైదరాబాద్): అమెరికాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నగరంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. ఐఎస్‌సదన్ డివిజన్ వాణీనగర్‌లో నివసించే వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ అధికారి షేక్ అబ్దుల్ సయీద్ కుమారుడు షేక్ అబ్దుల్ నవీద్ (48) ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కో వెళ్లారు. అక్కడి మెక్ ఫార్మా కంపెనీలో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఆయనకు భార్య నజియా సల్మా (45), కుమార్తె నేహా నహీన్ షేక్ (19), కుమారుడు హఫీజ్ ఉమర్ షేక్ (14), మరో కుమార్తె ఖతీజా షేక్ (8) ఉన్నారు. కాగా నవీద్ కుటుంబంతో కలిసి కారులో తాను నివసిస్తున్న ప్రాంతం నుంచి కారులో నవేడా అనే ప్రాంతానికి విహార యాత్ర (ఫ్యామిలీ టూర్)కు బయలుదేరారు. అయితే భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నజియా సల్మా, నేహా నహీన్ షేక్, హఫీజ్ ఉమర్ షేక్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలకు గురైన షేక్ అబ్దుల్ నవీద్, ఖతీజా షేక్‌లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వాణీనగర్‌లో విషాద ఛాయలు
యాకుత్‌పురా నియోజకవర్గం ఐఎస్‌సదన్ డివిజన్ వాణీనగర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం పాలవడంతో కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్‌లు వాణీనగర్‌కు చేరుకుని నవీద్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే తనకు, తన భార్య నజీమున్నీసా, సోదరుడు షేక్ అబ్దుల్ జావీద్‌లకు అమెరికా వీసాలు ఇప్పించాలని నవీద్ తండ్రి షేక్ అబ్దుల్ సయీద్ అభ్యరి్థంచారు.


