దుర్గమ్మకు ఉత్తరాంధ్ర సారె | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు ఉత్తరాంధ్ర సారె

Jul 22 2026 2:17 AM | Updated on Jul 22 2026 2:17 AM

దుర్గమ్మకు ఉత్తరాంధ్ర సారె

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఉత్తరాంధ్ర సంప్రదాయంలో మూడు వందల మంది భక్తులు ఆషాఢ సారెను సమర్పించారు. విజయనగరానికి చెందిన మూడు వందల మందికి పైగా భక్తులు తమ సొంత ఖర్చులతో 5 బస్సులను ఏర్పాటు చేసుకుని మంగళవారం ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఉత్తరాంధ్రలో పుట్టింటి నుంచి అత్త ఇంటికి వెళ్లే ఆడపిల్లకు ఇచ్చే విధంగా వెదురు బుట్టలలో అరిసెలు, చక్రాలు, నాడూలు, పంచదార చిలకలు, చెక్క భరిణెలలో పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, గాజులు, పూలతో పాటు పట్టుచీరలను భక్తులు అమ్మవారికి సమర్పించారు. వీరికి ఆలయ ఈవో శీనానాయక్‌ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయడంతో పాటు మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద ప్రత్యేక పూజలతో పాటు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మహా మండపం రెండో అంతస్తులో వారికి ప్రత్యేక భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఏటా తమ కుటుంబాల తరఫున అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు పేర్కొన్నారు.

కొనసాగుతున్న సారె సమర్పణలు..

ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు, భక్త బృందాలు ఆషాఢ సారెను సమర్పించాయి. మంగళవారం అయినా సారె సమర్పించే భక్తులతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం కనిపించింది. 7వ రోజైన మంగళవారం సాయంత్రానికి 35కు పైగా బృందాలు సారె సమర్పించాయి. సదరు బృందాలతో పాటు మొత్తంగా పది వేలకు మందికి పైగా భక్తులు అమ్మవారికి సారె సమర్పించిన వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement