బైక్‌ మెకానిక్‌ చోర ప్రావీణ్యం | - | Sakshi
Sakshi News home page

బైక్‌ మెకానిక్‌ చోర ప్రావీణ్యం

Jul 21 2026 2:00 AM | Updated on Jul 21 2026 2:00 AM

రూ.లక్షల ఖరీదు చేసే బైక్‌లే టార్గెట్‌ స్నేహితులతో కలిసి ఖరీదైన బైకుల చోరీ రూ.7లక్షల విలువైన నాలుగు బైక్‌లు స్వాధీనం

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): వారంతా 20 ఏళ్ల లోపు యువకులే... తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే... వారికి మాత్రం ఖరీదైన, హైస్పీడ్‌ మోటార్‌ బైక్‌లను నడపాలని ఆశ... కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం చేసేలోగా తమ కలలు తీర్చుకోవాలంటే చాలా సమయం పడుతుందనుకున్నారేమో... స్నేహితులందరూ చదువును మధ్యలోనే ఆపేసి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో బైక్‌ మెకానిక్‌గా పని చేసిన స్నేహితుడి సాయంతో ఖరీదైన బైక్‌లను చోరీలకు పాల్పడి వాటితో జల్సాలు చేయడం, బైక్‌లపై స్టంట్‌లు చేసి రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయసాగారు. అయితే సోమవారం పోలీసుల తనిఖీలలో వారి గుట్టు బయట పడింది. నిందితుల నుంచి రూ.7 లక్షల విలువైన నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. కొత్తపేట సీఐ కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్‌ జిల్లా మైలవరానికి చెందిన బాణావత్తు హనుమంతు(20) 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత స్కూల్‌కు వెళ్లకుండా బైక్‌ మెకానిక్‌ షెడ్‌లో పని చేశాడు. కొంత కాలం పనిచేసిన తర్వాత సొంతంగా షెడ్డు పెట్టుకుని జీవించాలనుకున్నాడు. బైక్‌ మెకానిక్‌ షాపులో డబ్బులు అంతంత మాత్రంగా వస్తుండటంతో మామిడి తోటల్లో పని చేసేవాడు. అయితే అక్కడ వచ్చిన డబ్బులు కూడా జల్సాలకు సరిపోకపోవడంతో ఎలా అయినా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలని భావించాడు.

బైక్‌ రిపేరు పరిజ్ఞానాన్ని వినియోగించి...

విజయవాడ కొత్తపేట, భవానీపురం ప్రాంతాలకు వచ్చి రెక్కీ నిర్వహించాడు. ఇంటి ముందు నిలిపి ఉన్న ఖరీదైన ద్విచక్ర వాహనాలను గుర్తించేవాడు. బైక్‌ హ్యాండిల్‌ లాక్‌ విరగొట్టి తనకు ఉన్న మెకానిక్‌ పరిజ్ఞానంతో వైర్లను కలిసి బైక్‌ ఇంజన్‌ స్టార్ట్‌ చేసేవాడు. అలా చోరీ చేసిన బైక్‌లను తన స్నేహితులైన మైలవరానికి చెందిన వేముల మణికంఠ(20), పత్తిపాటి చిట్టిబాబు(19), ఇస్లావత్‌ దినేష్‌(19)లకు ఇచ్చేవాడు. చోరీ చేసిన బైక్‌లతో స్టంట్‌ చేయడం, హైస్పీడ్‌గా వెళుతూ వాటిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయాలని నిర్ణయించుకుని నాలుగు బైక్‌లను చోరీలకు పాల్పడ్డాడు. చోరీ చేసిన బైక్‌లను స్నేహితులు నలుగురు వినియోగించసాగారు.

పోలీసుల తనిఖీలలో పట్టుబడి...

కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాముల కాల్వ వద్ద క్రైం ఎస్‌ఐ హరిప్రసాద్‌ వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో హనుమంత్‌ స్నేహితులు బైక్‌లపై పాముల కాల్వ వైపు వస్తుండటం, అదే సమయంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండటంతో నలుగురు బైక్‌లను వెనక్కి తిప్పారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి వారిని వెంబడించి వాహనాల రికార్డులపై ఆరా తీశారు. అయితే వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో స్టేషన్‌కు తరలించి విచారించడంతో చోరీల బాగోతం బయటపడింది. నిందితులపై కేసు నమోదు చేసి వారి నుంచి రూ.7లక్షల విలువైన నాలుగు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement