థానే: మహారాష్ట్రలోని థానేలో మన్‌పాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భయానక ఘటన వెలుగుచూసింది. పూణెకు చెందిన హసిబా అనే మహిళ తన ప్రియుడు హమిదిల్లా ఇస్లామ్‌ను దారుణంగా హత్య చేసింది. వివాహేతర సంబంధం లేదా వ్యభిచార కూపంలోకి నెట్టేయాలని చూశాడనే అనుమానంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. సుమారు ఐదు రోజుల క్రితం ప్రియుడిని హతమార్చిన నిందితురాలు, మృతదేహాన్ని ముక్కలుగా నరికింది. అనంతరం దుర్వాసన రాకుండా, త్వరగా కుళ్లిపోవడానికి బాత్రూమ్‌లోని రన్నింగ్ వాటర్ ట్యాప్ కింద ఆ మృతదేహాన్ని గోనెసంచిలో దాచింది.
ఈ దారుణానికి పాల్పడిన తర్వాత హసిబా కోల్‌కతాకు పరారైంది. అయితే ఫ్లాట్ యజమానికి వాయిస్ మెసేజ్ పంపి తాను హత్య చేసినట్లు తెలిపింది. అపార్ట్‌మెంట్ పరిసర ప్రాంతాలలో విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తాళాలు పగలగొట్టి పరిశీలించగా, కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితురాలిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని కోల్‌కతాకు పంపారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఉద్రిక్తత.. ‘మహా పంచాయత్’తో కదం తొక్కిన అన్నదాతలు!


