శివాలయంలోని వినాయకుడి ఆలయంలో, కొండపై ఉన్న మహాగణపతి ఆలయంలో హుండీలను పగులగొట్టిన దొంగలు
పెనమలూరు: విజయవాడ యనమలకుదురు కొండపై గల రెండు గణపతి ఆలయాల్లో దొంగలు హుండీలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురు కొండపై గల శ్రీపార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ గణపతి ఆలయంలో హుండీని పగులగొట్టి అందులో సొమ్మును చోరీ చేశారు. ఆదివారం రాత్రి ఆలయంలో పూజా కార్యక్రమాలు ముగిసిన తరువాత ప్రధాన ద్వారాలు మూసి తాళాలు వేశారు. దొంగ దాదాపు 15 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయ గోడపై (ప్రాకారం) నుంచి ఆలయంలోకి దిగాడు.
శివాలయం పక్కనే ఉన్న శ్రీగణపతి ఆలయం హుండీ పగులగొట్టి అందులో సొమ్ము చోరీ చేశారు. అయితే ఇటీవల హుండీల లెక్కింపు జరగటంతో హుండీలో తక్కువ సొమ్ము మాత్రమే ఉండి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఆలయ ప్రధాన ద్వారాలు మూసివున్నా.. వాచ్‌మెన్, సీసీ కెమెరాలు ఉన్నా దొంగ చాకచక్యంగా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి దొంగతనం చేయటం కలకలం చెలరేగింది. ఆలయ ప్రాంణంలో దిగిన దొంగ తిరిగి బయటకు ఎలా వెళ్లాడనేది మిస్టరీగా ఉంది.
మహాగణపతి ఆలయంలోనూ..
కొండ పైమార్గంలో ఉన్న మరో శ్రీమహాగణపతి ఆలయంలో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయం ప్రధాన ద్వారాలు మూసి ఉండటంతో దొంగ గుడి పక్కనే ఉన్న చెట్టుపై నుంచి ఆలయంలోకి దిగి గ్రిల్ తాళం పగులగొట్టాడు. ఆలయ హుండీని పగులగొట్టి సొమ్ము చోరీ చేశాడు. గత శివరాత్రి తరువాత హుండీ లెక్కించలేదని, దాదాపు రూ.50 వేల సొమ్ము పోయి ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. క్రైమ్ పోలీసులు, క్లూస్ టీమ్ రంగంలోకి సీసీ కెమెరా ఫుటేజీ, వేలిముద్రలు సేకరించారు.


