ఆ జీవో పునరుద్ధరిస్తామని పలుదఫాలు హామీలిచ్చి మోసం
చంద్రబాబు సర్కార్ తీరుపై రగిలిపోతున్న గిరిజన యువత
ఓట్ల కోసం ఆదివాసీలనూ మోసగించడంపై ఆగ్రహం
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరుతో యువతను వంచించిన సీఎం చంద్రబాబు చివరకు అడవి బిడ్డలనూ వదల్లేదు! గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు వంద శాతం గిరిజనులకే కల్పించే జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి మంగళం పాడేశారు! 2024 ఎన్నికల ముందు అరకు బహిరంగ సభలో చంద్రబాబు.. సాలూరు, పార్వతీపురం, పాలకొండ సభల్లో లోకేశ్ జీవో 3 పునరుద్ధరిస్తామంటూ హామీలిచ్చి మభ్యపెట్టారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలోనూ ఎన్నికల హామీని నిలబెట్టుకుంటామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు. గతేడాది డీఎస్సీ సమయంలో జీవో 3ని పునరుద్ధరించకుంటే తాము తీవ్రంగా నష్టపోతామంటూ గిరిజన యువత రెండు రోజులు ఏజెన్సీ బంద్ నిర్వహించడంతో మరోసారి మభ్యపుచ్చారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా జీవో పునరుద్ధరణ జరగకపోవడంతో ఏజెన్సీ గ్రామాల్లో నిరుద్యోగ గిరిజన యువత రగిలిపోతోంది.
ఇదీ జీవో 3 ప్రస్థానం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టులన్నీ గిరిజనులకే (ఎస్టీ) రిజర్వ్ చేసేలా సీనియర్ ఐఏఎస్ అధికారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్‌ఆర్ శంకరన్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5లోని 5(1) అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం 5–11–1986లో జీవో 275 తెచ్చింది.
గిరిజనులు విద్య, ఉద్యోగాల ద్వారా ఆర్థిక అభ్యున్నతి సాధించాలన్నది దీని లక్ష్యం. ఆ జీఓపై పలువురు కోర్టుకు వెళ్లడంతో గిరిజన అభ్యర్థులు అందుబాటులోకి వచ్చే వరకు ఆ ప్రాంతంలోని ఉపాధ్యాయ పోస్టుల్లో గిరిజనేతరులు ఉండవచ్చని జీవో 275ను సవరిస్తూ 25–4–1988లో జీవో 73 ఇచ్చారు. అయితే షెడ్యూల్డ్ ప్రాంతంలో తమకు అవకాశం ఇవ్వకపోవడంపై గిరిజనేతరులు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌లు వేశారు.
న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్న క్రమంలో ఆరి్టకల్ 244 షెడ్యూల్ 5 ప్రకారం రాష్ట్రపతి నోటిఫై చేసిన షెడ్యూల్డ్ గ్రామాల్లో వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకు ఇచ్చేలా జీఓ 3ను 10–01–2000లో తెచ్చారు. కానీ టీడీపీ పాలనలోనే ఈ జీవోను సవాలు చేస్తూ గిరిజనేతరుడు లీలా ప్రసాద్ చాబ్రోలు సుప్రీం కోర్టులో 2002లో పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు న్యాయ వివాదాలు రేకెత్తగా అత్యధిక కాలం టీడీపీనే అధికారంలో ఉంది. వీటిని పరిష్కరించకుండా టీడీపీ సర్కారు ఉదాసీనంగా వ్యవహరించింది.
సుప్రీం తీర్పుతో..
గిరిజనేతరులు దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనువుగా ఈ జీవో లేదని రద్దు చేస్తూ 22–4–2020(కరోనా సమయం)లో తీర్పు చెప్పింది. ఇదే తరహా జీవో మళ్లీ తెస్తే 1986 నుంచి గిరిజనులకు ఇచ్చిన ఉద్యోగాలు కోల్పోతారని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేయగా 3–4–2024న(ఎన్నికల ముందు) డిస్మిస్ చేసింది.
ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్, సంధ్యారాణి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా తాము జీవో 3ను పునరుద్ధరిస్తామంటూ గిరిజనులను నమ్మించి వంచించారు. ఇదే హామీని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేస్తే చంద్రబాబు దొంగాట ఆడుతున్నారంటూ గిరిజన యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓట్ల కోసం గిరిజనులను మోసం చేస్తారా?: పీడిక రాజన్నదొర, మాజీ ఉపముఖ్యమంత్రి ్డ


