పనులు నాసిరకం.. ‘బలుసు’కు రూ.70.80 కోట్లు బహుమానం! | Handri-Neeva Main Canal Second Phase Lining Work | Sakshi
Sakshi News home page

పనులు నాసిరకం.. ‘బలుసు’కు రూ.70.80 కోట్లు బహుమానం!

Jul 24 2026 5:34 AM | Updated on Jul 24 2026 5:34 AM

Handri-Neeva Main Canal Second Phase Lining Work

హంద్రీ–నీవా రెండో దశ కాలువ 360.4 కి.మీ నుంచి 400.5 కి.మీ వరకు లైనింగ్‌ పనులు 

రూ.204.60 కోట్లకు బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాకు అప్పగింత 

అత్యంత నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టర్‌

ఒక ఏడాది నీటి ప్రవాహానికే కొట్టుకు­పోయిన లైనింగ్‌

సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ ప్రధాన కాలువ లైనింగ్‌ పనులు నాసిరకంగా చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తద్భిన్నంగా నజరానా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒప్పందం ప్రకారం సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్‌ నుంచి నష్టపరిహారం వసూలు చేయాల్సిందిపోయి, అంచ­నా వ్యయాన్ని పెంచేసి.. భారీగా లబ్ధి చేకూర్చేందుకు మార్గం సుగమం చేసింది. ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.241.20 కోట్ల నుంచి రూ.­312 కోట్లకు పెంచేస్తూ గురువారం కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

తద్వారా ఆ కాంట్రాక్ట­ర్‌కు రూ.70.80 కోట్లు ప్రయోజనం చేకూరనుంది. ఇలా ఎందుకు చేసిందంటే.. ఆ కాంట్రాక్టర్‌ బ­లుసు శ్రీనివాసరావు (బీఎస్సార్‌ ఇన్‌ఫ్రా) సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కా­వ­డమేనని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ ప్రధాన కాలువ 360.4 కి.మీ నుంచి 400.5 కి.మీ వరకు లైనింగ్‌ పనులకు రూ.195.21 కోట్ల అంచనాతో గతేడాది జనవరిలో జల వ­నరుల శాఖ టెండర్లు పిలిచింది. వాటిని రూ.­204.60 కో­ట్లకు కోట్‌ చేసిన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రా దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం ఈ పనుల­ను ఆర్నెలల్లో­గా పూర్తి చేయాలి. కానీ.. సకాలంలో పూర్తి చేయలేదు. మిగిలిన పనులను ఇప్పుడు చేస్తోంది.  

అత్యంత నాసిరకంగా లైనింగ్‌  
గతంలో కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని, రాళ్లను గట్లపై పోశారు. ఆ గట్లపై ఉన్న రాళ్ల నుంచి కంకర తయారు చేశారు. ఆ కంకర పిండి పిండిగా నాసి రకంగా ఉంది. సమీపంలో వాగులు, వంకల్లో ఇసుకను తెచ్చారు. నాసిరకం కంకర, ఇసుక.. తక్కువ పరిమాణంలో సిమెంటుతో ఎం–25 మిక్సర్‌ (ఒక పాలు సిమెంటు, ఒక పాలు ఇసుక, రెండు పాళ్లు 20 ఎంఎం కంకర కలిపి తయారుచేసే మిశ్రమం), ఎం–20 (ఒక పాలు సిమెంటు, 1.5 పాళ్లు ఇసుక, 3 పాళ్లు 12 ఎంఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం) మిక్సర్‌ తయారు చేశారు.

కాలువకు ఇరువైపులా ఇన్‌క్లెయిన్‌డ్‌ రోలర్‌తో గట్టిపరచక పోవడంతో ఎక్కడికక్కడ మట్టి జారిపోతున్నా పేవర్‌ యంత్రాన్ని వినియోగించకుండా.. కార్మీకులతోనే సిమెంటు కాంక్రీట్‌తో లైనింగ్‌ చేశారు. మట్టి జారిపోతున్నా సరే అలానే లైనింగ్‌ వేశారు. దీనివల్ల గత ఆగస్టు­లో కాలువకు నీటిని విడుదల చేయగానే లై­నింగ్‌ ఎక్కడికక్కడ జారిపోయి కొట్టుకుపోయింది. ఎం–25, ఎం–20 కాంక్రీట్‌లో సిమెంటు త­క్కు­వగా, ఇసుక ఎక్కువగా, నాసిరకం కంకర వినియోగించడం వల్ల లైనింగ్‌ చేసిన ప్రాంతాల్లో ఇసుక పైకి తేలి స్పష్టంగా కని్పస్తోంది.  

తుంగలోకి టెండర్‌ నిబంధనలు   
టెండర్‌ నిబంధనల ప్రకారం రాతి పొర ఉన్న చోట్లే షార్ట్‌ క్రీటింగ్‌ విధానంలో లైనింగ్‌ చేయాలి. నిబంధనల్లో ఎక్కడా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ (స్టీల్‌ ఫైబర్‌ రీయిన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌) ప్రస్తావనే లేదు. టెండర్‌లో పేర్కొన్న దానికి భిన్నంగా పని స్వభావం మారితే స్టేట్‌ లెవల్‌ టెక్నికల్‌ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) ఆమోదం పొంది.. ప్రభుత్వ అనుమతి తీ­సు­కోవాలి. కానీ, టెండర్‌లో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే సాకు చూపి.. షా­ర్ట్‌ క్రీటింగ్‌ విధానంలో పనులు చేస్తే జాప్యం జ­రుగుతుందని సాకులు వెతికి.. ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ వి­ధా­నాన్ని కాంట్రాక్టర్లు ప్రతిపాదించారు.

అయి­నా ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజి­నీరింగ్‌ అధికా­రులు నోరు మెదపలేక పోయా­రని జల వనరు­ల శాఖ అధికారులు చెబుతున్నారు. రాతి పొర లే­కున్నా, మట్టి పొరకే.. కనీ­సం కాలువ గట్ల వా­లును క్రమానుగతంగా సరి చేయకుండానే ఇష్టా­రాజ్యంగా అత్తెసరు మందంతో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో కాంట్రాక్టర్లు లైనింగ్‌ పనులు కానిచ్చేశారు. షార్ట్‌ క్రీటింగ్‌ పద్ధతిలో లైనింగ్‌ చేస్తే చదరపు మీటరుకు రూ.1,407 చొప్పున బిల్లు చెల్లిస్తారు. అదే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్‌ చేస్తే రూ.­1,854 చెల్లిస్తారు. కానీ.. హంద్రీ–నీవా పనుల్లో రూ.­2,400 చొప్పున బిల్లులు చెల్లించారు. ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో నాసిరకంగా వేసిన లైనింగ్‌ ఒక్క సీజన్‌లో నీటి ప్రవాహానికే ఎక్కడికక్కడ కొట్టుకుపోయింది. గతేడాది చేయగా మిగిలిన పనులను ఈ ఏడాదీ నాసిరకంగా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement