హనుమాన్ విగ్రహం దొంగ టీడీపీ నేత | TDP leader steals Hanuman statue | Sakshi
Sakshi News home page

హనుమాన్ విగ్రహం దొంగ టీడీపీ నేత

Jul 24 2026 5:21 AM | Updated on Jul 24 2026 7:03 AM

TDP leader steals Hanuman statue

బీటెక్‌ చదివిన నిందితుడు జశ్వంత్‌ కుమార్‌ ఐటీడీపీ భీమిలి నియోజకవర్గం కార్యదర్శి

టీడీపీ ఎమ్మెల్యే గంటా కుమారుడి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు

మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ స్పీకర్‌తోనూ సాన్నిహిత్యం

ఒంగోలు రైల్వే స్టేషన్‌లో నిందితుడి అరెస్ట్‌.. విగ్రహం స్వాదీనం

ఆపై నిందితుడి బ్యాక్‌ గ్రౌండ్‌ తెలిసి విస్తుపోయిన వైనం

అప్పటికే సోషల్‌ మీడియాలో రావడంతో ఎల్లో మీడియా డైవర్షన్‌ డ్రామా

అతడికి మతిస్థిమితం సరిగా లేదంటూ కొత్త పల్లవి

తిరుపతి క్రైం/తిరుమల/తగరపువలస: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని ఏడో మైలురాయి వద్ద బుధవారం వేకువజామున అపహరణకు గురైన ఆంజనేయస్వామి విగ్రహం కేసు గురువారం సంచలన మలుపు తిరిగింది. ఈ ఘటనలో అరెస్టయిన నిందితుడు భీమిలికి చెందిన టీడీపీ నాయకుడేనన్న విషయం వెలుగులోకి రావడంతో సోషల్‌ మీడియా, వార్తా ఛానళ్లలో పెద్దఎత్తున చర్చకు దారితీసింది. నిందితుడు విశాఖ జిల్లా భీమిలి మండలం టి.నగరపాలెం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పొట్నూరు రాము కుమారుడు, ఐటీడీపీ కార్యదర్శి జశ్వంత్‌కుమార్‌ (22) అని తేలింది. 

ఈ విగ్రహం చోరీ వెనుక మరెవరైనా ఉన్నారా? జశ్వంత్‌కు ఎవరైనా ప్రోత్సాహం అందించారా? చోరీ సమయంలో ఇంకెవరైనా సహకరించారా? అనే కోణాల్లో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు జశ్వంత్‌ భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజకు అత్యంత కీలక సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు. బీటెక్‌ చదివి, ఐటీడీపీలో భీమిలి నియోజకవర్గం కార్యదర్శిగా కొనసాగుతున్న జశ్వంత్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. 

మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కూడా సాన్నిహిత్యం ఉన్నట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. వీరితో ఉన్న పరిచయాలను అడ్డుపెట్టుకుని గతంలో పలువురిని బెదిరించిన సందర్భాలున్నాయని ఆరోపణలు ఉన్నాయి. తన కుమారుడు ఆంజనేయస్వామి విగ్రహం అపహరణ కేసులో పోలీసులకు చిక్కిన విషయం బుధవారమే తెలిసినా, టీడీపీ ఉన్నత నాయకత్వం సూచనల మేరకు పొట్నూరు రాము మౌనం పాటించారు.   

సాంకేతికత ఆధారంగా నిందితుడి అరెస్ట్‌ 
తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని మామండూరు మిట్ట వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలోని చిన్న అభయ ఆంజనేయస్వామి విగ్రహం అపహరణకు గురైన కేసును తిరుపతి జిల్లా పోలీసులు 15 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ వివరాలను జిల్లా ఏఎస్పీలు గురువారం మీడియాకు వెల్లడించారు. టీటీడీ ఏవీఎస్‌ఓ ఎ.వెంకట శివకుమార్‌ ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్‌ పోలీసులు టీటీడీ విజిలెన్స్‌ అధికారులతో కలిపి ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా విస్తృతంగా గాలింపు నిర్వహించారు. 

నిందితుడు ప్రయాణించిన జీపును గుర్తించి, అతని కదలికలను విశ్లేషించారు. రైల్వే పోలీసుల సహకారంతో ఒంగోలు రైల్వే స్టేషన్‌లో విశాఖపటా్ననికి చెందిన పొట్నూరు జశ్వంత్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి విగ్రహాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, జశ్వంత్‌ కుమార్‌ ఇంజినీరింగ్‌ వరకు చదివి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడని, మూడేళ్లుగా మానసిక పరిస్థితి స్థిరంగా లేదని కుటుంబ సభ్యులు విచారణలో తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గొర్ల మండలంలోని భువనేశ్వరి పీఠంతో అతనికి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. 

నిందితుడు పొట్నూరు జశ్వంత్‌ కుమార్‌ను రిమాండ్‌కు తరలించి, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని  విచారించనున్నట్లు వెల్లడించారు. కాగా, నిందితుడు జశ్వంత్‌ మానసిక స్థితి బాగోలేదని తిరుపతి పోలీసులు చెప్పడం సరికాదని భీమిలి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు రైల్వేస్టేషన్‌లో విగ్రహంతో జశ్వంత్‌ దొరకగానే విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిందని, అతడి బ్యాక్‌ గ్రౌండ్‌ తెలిసిపోయిందని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు.. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని డైవర్షన్‌ డ్రామాకు తెర లేపారని ఆరోపిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన కూడా నిందితుడు తన స్నేహితులతో కలిసి తిరుమల వెళ్లొచ్చారని స్థానికులు తెలిపారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement