జ్వరం.. గొంతు నొప్పి.. దగ్గు.. ముక్కు కారడం.. | Medical advice amidst the rise in COVID-19 cases | Sakshi
Sakshi News home page

జ్వరం.. గొంతు నొప్పి.. దగ్గు.. ముక్కు కారడం..

Jul 24 2026 5:59 AM | Updated on Jul 24 2026 5:59 AM

Medical advice amidst the rise in COVID-19 cases

కరోనా ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌–5 రకం ప్రధాన లక్షణాలు

రెండు, మూడు రోజులైనా నయం అవకపోతే వైద్యులను సంప్రదించాలి 

రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో వైద్యుల సూచనలు 

ఇప్పటివరకూ రాష్ట్రంలో 32 కేసుల నమోదు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌–5 వేరియంట్‌కు చెందినవని పూణే వైరాలజీ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ఈ నేపథ్యంలో జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు కారడంతో పాటు గొంతు నొప్పి/గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలుంటే వెంటనే అప్రమత్తమవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు రెండు మూడు రోజులైనా తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలని సూస్తున్నారు. సాధారణంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌లో వైరస్‌ తీవ్రత తక్కువగా ఉంటుందని, రాష్ట్రంలో ఈ వైరస్‌ సోకిన నలుగురు మృత్యువాత పడడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

ప్రభావం ఎవరిపై ఎక్కువ? 
కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారిపై తీవ్ర ప్రభావం ఉంటోంది. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ, కాలేయ సమస్యలు, ఆస్తమా, సీవోపీడీ వంటి శ్వాస కోశ సమస్యలున్నవారు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. క్యాన్సర్‌ చికిత్స పొందుతున్న వారు, హెచ్‌ఐవీ బాధితులకు వైరస్‌ సోకితే తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు. గర్భిణులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. 

పలు జిల్లాల్లో కరోనా కేసులు 
వైద్యశాఖ వివరాల ప్రకారం గతనెల 26 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 32 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. గురువారం విశాఖ జిల్లాలో మూడు కొత్త కేసులు నమోదైనట్టు వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. వైరస్‌ బాధితుల్లో వైఎస్సార్‌ జిల్లాలో ముగ్గురు, కాకినాడలో ఒకరు మృత్యువాతపడ్డారు.

సెల్ఫ్‌ ఐసోలేషన్‌ పాటించాలి 
ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌–5 తీవ్రమైన వైరస్‌ కాదు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. అనుమానిత లక్షణాలున్న వారు ఇంట్లోనే సెల్ఫ్‌ ఐసోలేషన్‌ పాటించాలి. ఇంట్లో ఉన్నా మాస్క్‌ ధరించి, మిగిలిన కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. కుటుంబం అంతా కలిసి ఏసీల్లో నిద్రించకూడదు. అలా చేస్తే వైరస్‌ ఇతరులకు వ్యాపిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు సమూహాల్లోకి వెళ్లినప్పుడు మాస్క్‌ ధరలించాలి. చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం వంటి 
ముందస్తు జాగ్రత్తలు పాటించాలి.  
– డాక్టర్‌ ఎస్‌. రఘు, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఛాతీ, సాంక్రమిక వ్యాధుల ఆస్పత్రి, గుంటూరు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement