breaking news
God statues
-
హనుమాన్ విగ్రహం దొంగ టీడీపీ నేత
తిరుపతి క్రైం/తిరుమల/తగరపువలస: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలురాయి వద్ద బుధవారం వేకువజామున అపహరణకు గురైన ఆంజనేయస్వామి విగ్రహం కేసు గురువారం సంచలన మలుపు తిరిగింది. ఈ ఘటనలో అరెస్టయిన నిందితుడు భీమిలికి చెందిన టీడీపీ నాయకుడేనన్న విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా, వార్తా ఛానళ్లలో పెద్దఎత్తున చర్చకు దారితీసింది. నిందితుడు విశాఖ జిల్లా భీమిలి మండలం టి.నగరపాలెం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పొట్నూరు రాము కుమారుడు, ఐటీడీపీ కార్యదర్శి జశ్వంత్‌కుమార్ (22) అని తేలింది. ఈ విగ్రహం చోరీ వెనుక మరెవరైనా ఉన్నారా? జశ్వంత్‌కు ఎవరైనా ప్రోత్సాహం అందించారా? చోరీ సమయంలో ఇంకెవరైనా సహకరించారా? అనే కోణాల్లో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు జశ్వంత్ భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజకు అత్యంత కీలక సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు. బీటెక్ చదివి, ఐటీడీపీలో భీమిలి నియోజకవర్గం కార్యదర్శిగా కొనసాగుతున్న జశ్వంత్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కూడా సాన్నిహిత్యం ఉన్నట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. వీరితో ఉన్న పరిచయాలను అడ్డుపెట్టుకుని గతంలో పలువురిని బెదిరించిన సందర్భాలున్నాయని ఆరోపణలు ఉన్నాయి. తన కుమారుడు ఆంజనేయస్వామి విగ్రహం అపహరణ కేసులో పోలీసులకు చిక్కిన విషయం బుధవారమే తెలిసినా, టీడీపీ ఉన్నత నాయకత్వం సూచనల మేరకు పొట్నూరు రాము మౌనం పాటించారు. సాంకేతికత ఆధారంగా నిందితుడి అరెస్ట్ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని మామండూరు మిట్ట వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలోని చిన్న అభయ ఆంజనేయస్వామి విగ్రహం అపహరణకు గురైన కేసును తిరుపతి జిల్లా పోలీసులు 15 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ వివరాలను జిల్లా ఏఎస్పీలు గురువారం మీడియాకు వెల్లడించారు. టీటీడీ ఏవీఎస్ఓ ఎ.వెంకట శివకుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్ పోలీసులు టీటీడీ విజిలెన్స్ అధికారులతో కలిపి ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా విస్తృతంగా గాలింపు నిర్వహించారు. నిందితుడు ప్రయాణించిన జీపును గుర్తించి, అతని కదలికలను విశ్లేషించారు. రైల్వే పోలీసుల సహకారంతో ఒంగోలు రైల్వే స్టేషన్లో విశాఖపటా్ననికి చెందిన పొట్నూరు జశ్వంత్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి విగ్రహాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, జశ్వంత్ కుమార్ ఇంజినీరింగ్ వరకు చదివి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడని, మూడేళ్లుగా మానసిక పరిస్థితి స్థిరంగా లేదని కుటుంబ సభ్యులు విచారణలో తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గొర్ల మండలంలోని భువనేశ్వరి పీఠంతో అతనికి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. నిందితుడు పొట్నూరు జశ్వంత్ కుమార్‌ను రిమాండ్‌కు తరలించి, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు వెల్లడించారు. కాగా, నిందితుడు జశ్వంత్ మానసిక స్థితి బాగోలేదని తిరుపతి పోలీసులు చెప్పడం సరికాదని భీమిలి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు రైల్వేస్టేషన్లో విగ్రహంతో జశ్వంత్ దొరకగానే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిందని, అతడి బ్యాక్ గ్రౌండ్ తెలిసిపోయిందని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు.. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని డైవర్షన్ డ్రామాకు తెర లేపారని ఆరోపిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన కూడా నిందితుడు తన స్నేహితులతో కలిసి తిరుమల వెళ్లొచ్చారని స్థానికులు తెలిపారు. -
మహత్యమా? మతలబా?
పెద్దకడబూరు : యాదృచ్ఛికమో, మరేదైనా మతలబు ఉందో తెలియదు కానీ ఆ గ్రామంలో విగ్రహాలు వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది. మహత్తుతోనే విగ్రహాలు వెలుగు చూశాయని కొంద రు భావిస్తుండగా, అవి పురాతనమైనవి కాదని మరి కొందరి వాదన. ఏది ఏమైనా పెద్దకడబూరు మండలం గవిగట్టు గ్రామంలో అమ్మవారు, శివలింగ విగ్రహాల విషయం హాట్‌టాపిక్‌గా మారింది. గ్రామానికి చెందిన ఉప్పరి తిక్కయ్య, రామలింగమ్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు వెంకటేష్‌కు అప్పుడప్పుడు యల్లాగారి తాయమ్మవ్వ పూనకం వస్తుందట. అందులో భాగంగా గత గురువారం వారి పొలం గట్టులోని పుట్టలో శివ పార్వతుల విగ్రహాలు ఉన్నట్లు తెలిపారట. దీంతో వెంక టేష్ ఆ రోజు సాయంత్రం అమ్మవారి విగ్రహాన్ని పుట్టలో నుంచి తీసి పక్కనే ఉన్న గుడిసెలో పెట్టాడట. శివలింగాన్ని తీయడానికి చేతగాక పుట్టలోనే వదిలేశాడట. ఈ మేరకు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారు నాలుగు రోజుల పాటు సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. గ్రామస్తులు గమనించి చెప్పడంతో సోమవారం కొందరు వచ్చి దర్శించుకొని వెళ్లారు. గ్రామానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయి విగ్రహాలను చూడడానికి రాగా ఆమెకు కూడా పూనకం వచ్చిందని, వచ్చే ఏకాదశి రోజున శివలింగాన్ని తీయాలని, అది కూడా వెంకటేష్ మాత్రమే తీయాలని సెలవిచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ఈ సమాచారం ఆనోటా ఈనోటా పడడంతో మంగళవారం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన పెద్దతుంబళం, కామవరం, కోసిగి, నౌలేకల్లు తదితర గ్రామాల నుంచి వందల సంఖ్యలో జనాలు వచ్చి విగ్రహాలకు పూజలు చేశా రు. సాయంత్రం ఈ విగ్రహాలను ఆదోని తహసీల్దార్ శ్రీనాథ్, వీఆర్వో శ్రీనివాసులు స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం కర్నూలుకు తరలించారు. కొసమెరుపు: పుట్టలో నుంచి తీయడం తనవల్ల కాలే దని వెంకటేష్ చెబుతున్న శివలింగాన్ని అధికారులు సులభంగా తీసుకుని కర్నూలుకు తరలించారు. -
విగ్రహాలను పెకిలించిన దుండగులు
► గుప్తనిధులకోసం పెకిలించి ఉంటారని ఆరోపణ ► సంఘటన స్థలాన్ని పరిశీలించిన ముగ్గురు ఎస్ఐలు శాంతినగర్ : గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం దేవుడి విగ్రహాలను పెకిలించారు. ఈ సంఘటన వడ్డేపల్లి మండలం తనగల గట్టులో చోటుచేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తనగల గట్టుపై వెలసి న తిమ్మప్ప స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నారు. ఆలయ పూజారి పాండురంగయ్య ఎప్పటిలాగే శనివారం సాయంత్రం స్వామివారి ఆలయాన్ని మూసి తాళాలువేసి వెంకటాపురం చేరుకున్నాడు. బుధవారం పౌర్ణమి కావడంతో ఉదయం వెంకటాపురం భక్తులు కృష్ణారెడ్డి దంపతులు స్వామివారికి పూజలు చేద్దామని పూజారితో ఆలయాన్ని చేరుకున్నారు. వారు వెళ్లేలోగా ఆలయం తలుపులు తెరుచుకుని ఉన్నాయి. స్వామివారి మూల విరాఠ్ (పుట్టుశిల), వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని పెకిలించారు. వెంటనే అయిజ ఎస్ఐ రమేష్‌కు, సర్పంచ్ సత్యమ్మవేణుగోపాల్‌రెడ్డికి సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న తనగల సర్పంచ్ వాణిదివాకర్‌రెడ్డి శాంతినగర్ ఎస్ఐ జి.వెంకటేశ్వర్లకు జరిగిన సంఘటనను వివరించారు. దీంతో స్పందిం చిన అయిజ, శాంతినగర్, రాజోలి ఎస్ఐ జయశంకర్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గట్టుపై ఆలయ సమీపంలో మద్యం సీసాలు, అల్పాహారాలు పడి ఉండటం, నాలుగు అడుగులమేర విగ్రహాల క్రింద తవ్వడం చూసిన పోలీసులు రాత్రి సుమారు ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు మద్యంతాగి విగ్రహాలను ధ్వంసం చేసి ఉంటారన్నారు. ఆలయ పూజారులు పాండురంగయ్య, వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శాంతినగర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుల్ రామనాయుడు పేర్కొన్నారు.


