ఆస్తి వివాదం ఒక తండ్రి ప్రాణాలు తీసింది. 32 ఏళ్ల కొడుకు తన తండ్రిని పిస్టల్‌తో కాల్చి చంపేశాడు. రూ. 150 కోట్ల ఆస్తి పంపకం విషయంలో తలెత్తిన వివాదం ఈ విషాదానికి దారి తీసింది. ఘాజియాబాద్‌లోని మోదీనగర్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మృతుడిని మోదీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుదానా గ్రామానికి చెందిన 52 ఏళ్ల హరిఓం చౌదరిగా గుర్తించారు. ఆయన ఆ ప్రాంతంలోనే అత్యంత సంపన్న రైతులలో ఒకరు.హరిఓం చౌదరికి మోదీనగర్‌లో 75 బిగాల భూమితో పాటు ఢిల్లీ-మీరట్ రోడ్డులో ఒక మార్కెట్ కూడా ఉంది. అలా ఆయన మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ. 150 కోట్లు ఉంటుందని అంచనా.
గొడవకు కారణం
హరిఓం చౌదరి తన పెద్ద కుమారుడైన నిఖిల్‌కు ఇప్పటికే మార్కెట్‌లోని కొన్ని షాపులను, 25 బిగాల భూమిని ఇచ్చారు. అయితే, మిగిలిన భూమిని కూడా తన పేరు మీద రాయాలని నిఖిల్ గొడవ పడేవాడు. నిఖిల్‌కు మద్యపాన వ్యసనం ఉండటంతో, ఆస్తి ఇస్తే తాగుడుకు, జల్సాలకు తగలేస్తాడని తండ్రి నిరాకరించాడు. ఈ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య తరచూ వాగ్వాదం నడుస్తూ ఉండేది. ఈ క్రమంలో బుధవారం రాత్రి హరిఓం చౌదరి తన భార్య అనిత, చిన్న కుమారుడు నీషుతో కలిసి భోజనాలుముగించాక, పెద్ద కుమారుడు నిఖిల్ మద్యం మత్తులో ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. తాగి వచ్చినందుకు తండ్రి మందలించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన నిఖిల్ తన వద్ద ఉన్న పిస్టల్ తీసి తండ్రిపై కాల్పులు జరిపాడు. మొదట ఒక బుల్లెట్ హరిఓం ముఖానికి తగలడంతో ఆయన కింద పడిపోయారు. ఆ తర్వాత నిందితుడు ఆయన ముఖం, ఛాతి, పొత్తికడుపు భాగాలపై మరికొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. అనంతరం ఆయుధంతో సహా ఘటనా స్థలం నుండి పరారయ్యాడు.
ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్
గతంలోనూ ఇలా
పోలీసుల ప్రాథమిక విచారణలో నిఖిల్‌కు తాగుడు విషయంలో తరచూ తల్లిదండ్రులతో గొడవలు జరిగేవి. అంతేకాకుండా, 2018లో కూడా ఒక గొడవ సందర్భంగా నిఖిల్ తన తమ్ముడు నీషుపై కాల్పులు జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు ఆ పాత కేసును కూడా రీ-ఓపెన్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.. అతనిని అరెస్టు చేయడానికి పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు : వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
ఇదీ చదవండి: కీలక ఫెడ్ పదవులు : రఘురామ్ రాజన్, మరో ఇద్దరు భారతీయ నిపుణులు


