ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన రన్‌వీర్ సింగ్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' జపాన్ మార్కెట్‌లో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు భాగాలు కలిపి ఏకంగా రూ. 3,100 కోట్లకు పైగా వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ ఫ్రాంచైజీకి, జపాన్ ప్రేక్షకులు ఊహించని షాక్ ఇచ్చారు. భారీ రిలీజ్, పబ్లిసిటీ చేసినప్పటికీ.. మొదటి రోజు థియేటర్లకు కనీసం వెయ్యి మంది కూడా రాకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
తొలి రోజు కేవలం 900 మంది లోపే..!
స్థానిక పంపిణీ సంస్థ ‘ట్విన్’ (Twin) ద్వారా జపాన్ వ్యాప్తంగా దాదాపు 80 స్క్రీన్లలో జూలై 10న ‘ఆపరేషన్ ధురంధర్’ పేరుతో ఈ చిత్రం విడుదలైంది. అయితే జపనీస్ బాక్సాఫీస్ ట్రాకర్ ‘మిమోరిన్’ గణాంకాల ప్రకారం విడుదలైన రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు 57 ప్రదేశాలలో కలిపి కేవలం 449 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. సాయంత్రానికి థియేటర్ల సంఖ్య 80కి పెరిగినప్పటికీ ఆదరణలో ఎలాంటి మార్పు లేదు. మొదటి రోజు మొత్తం మీద 900 మంది ప్రేక్షకులు మాత్రమే సినిమాను వీక్షించారు.
భారీ ప్రచారం చేసినా ఫలితం శూన్యం
రిలీజ్‌కు ముందు జపనీస్ ఆడియన్స్‌ను ఆకర్షించేందుకు చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నించింది. రన్‌వీర్ సింగ్ స్వయంగా ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ‘ఇది భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ చిత్రం’ అంటూ ప్రమోట్ చేశారు. అయితే ఈ సినిమాను కేవలం జపనీస్ సబ్‌టైటిల్స్‌తోనే రిలీజ్ చేశారు. డబ్బింగ్ వెర్షన్ లేకపోవడం వల్లే జపాన్ ప్రేక్షకులు ఈ సినిమా వైపు పెద్దగా మొగ్గు చూపలేదని సోషల్ మీడియా టాక్.
కాగా, జపాన్‌లో మొదటి రోజు అత్యధిక అడ్మిషన్లు సాధించిన భారతీయ చిత్రంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ పంపిణీ చేసిన ‘RRR’ (8,230 అడ్మిషన్లతో) ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన ‘పుష్ప 2’ కూడా ఇక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.


