న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)2020లో భాగంగా 9, 10 తరగతుల విద్యార్థులకు మూడో భాషను పాఠశాల స్థాయి అంతర్గత మూల్యాంకన (ఇంటర్నల్ అసెస్‌మెంట్) తప్పనిసరి సబ్జెక్టుగా మారుస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్ష బోర్డు ద్వారా కాకుండా పాఠశాల స్థాయిలోనే జరుగుతుందని, అయితే ఇందులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని బోర్డు స్పష్టం చేసింది. ఇందులో పాస్ కాని విద్యార్థులకు టెన్త్ క్లాస్ పాస్ సర్టిఫికెట్ లభించదు.
ఈ నూతన త్రిభాషా సూత్రం ప్రకారం, విద్యార్థులు కచ్చితంగా రెండు భారతీయ భాషలను, ఒక పరభాషను (నాన్-నేటివ్ ల్యాంగ్వేజ్) చదవాల్సి ఉంటుంది. 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతిలోకి, 2027-28లో 10వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఒకవేళ 10వ తరగతిలో విద్యార్థి అంతర్గత పరీక్షలో ఉత్తీర్ణుడు కాకపోతే, బోర్డు ఫలితాల విడుదలకు ముందే పాఠశాలలు తిరిగి పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. 9వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులను 10వ తరగతికి ప్రమోట్ చేసినప్పటికీ, తదుపరి ఏడాదిలోగా ఆ పెండింగ్ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.


