ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బిహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నిక బరిలోకి దిగిన ఆయన.. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ప్రశాంత్ కిషోర్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన పేరిట చరాస్తులు రూ.22.19 కోట్లు, స్థిరాస్తులు రూ.73.87 కోట్లు ఉన్నాయి. మొత్తంగా ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.96 కోట్లకు చేరింది. అఫిడవిట్‌లో తన అప్పుల వివరాలను కూడా ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ప్రస్తుతం తనపై రూ.5.77 కోట్ల బ్యాంకు రుణం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన ఆస్తుల్లో ఘజియాబాద్‌లోని అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లు, మరో రెండు ఫ్లాట్లలో 50 శాతం వాటా ఉన్నట్లు తెలిపారు. అలాగే పాట్నాలోని పటాలిపుత్ర కాలనీ, ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ప్లాట్లు, బక్సర్, స్వగ్రామంలో ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
భార్య పేరిట భారీగానే..
ఇక ఆయన భార్య జాన్వి దాస్ పేరిట ఉన్న ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ భార్య జాన్వి దాస్ వైద్యురాలు. ఆమెకు రూ.89.51 కోట్ల చరాస్తులు, రూ.12.42 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. ఆమెకు గువాహటిలో రెండు ఫ్లాట్లు, ఓ బంగ్లాలో మూడో వంతు వాటా ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే నోయిడాలోనూ ఆస్తులు ఉన్నట్లు వివరించారు.
ఆ కంపెనీ నుంచి పార్టీకి విరాళాలు
ప్రశాంత్ కిషోర్ ‘వేదా వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీకి యజమానిగా ఉన్నారు. ఈ సంస్థ 2024-25లో జన్ సురాజ్‌కు రూ.85 కోట్ల విరాళం ఇచ్చినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అంతకుముందు 2023-24లో జన్ సురాజ్ ఫౌండేషన్‌కు రూ.50 లక్షలు, ‘జాయ్ ఆఫ్ గివింగ్’కు రూ.2.75 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వివరాలు ఉన్నాయి.
8 కేసులు.. ఇంకా విచారణ దశలోనే!
ప్రశాంత్ కిషోర్‌పై ఎనిమిది కేసులు నమోదై ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. వీటిలో పరువు నష్టం, అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, మోసం వంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏ కేసులోనూ ఇప్పటివరకు అభియోగాలు నమోదు కాలేదని పేర్కొన్నారు.
పీకే ఏం చదివారంటే..
ప్రశాంత్ కిషోర్ లక్నో విశ్వవిద్యాలయం నుంచి బీబీఏ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ కోర్సు చేశారు. ఫ్రెంచ్ భాషలోనూ సర్టిఫికేషన్ కోర్సు పూర్తి చేశారు.
ఎన్నికల వ్యూహకర్త నుంచి..
ప్రశాంత్ కిషోర్ గతంలో దేశంలోని పలు ప్రధాన రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రూపొందించిన విషయం తెలిసిందే. అయితే 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ వ్యూహకర్తగా తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. అనంతరం బిహార్‌కు తిరిగి వెళ్లి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
2022 అక్టోబర్ 2న ‘జన్ సురాజ్ అభియాన్’ను ప్రారంభించిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజలను కలిశారు. ఆ తర్వాత జన్ సురాజ్‌ను రాజకీయ పార్టీగా మార్చారు. ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆ ఎన్నికల్లో పీకే పోటీకి దూరంగా ఉన్నారు. అయితే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ ఉప ఎన్నిక ద్వారా పోటీ చేస్తున్నారు.
పాట్నా జిల్లా పరిధిలో ఉన్న బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం నుంచి గెలిచిన బీజేపీ నేత నితిన్ నబీన్ రాజీనామా చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం(బీజేపీ జాతీయాధ్యక్షుడు+రాజ్యసభ సభ్యుడు)తో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీజేపీ తరఫున నీరజ్ కుమార్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. అతి త్వరలో బై ఎలక్షన్ జరగనుంది.
బిహార్ రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్న ప్రశాంత్ కిషోర్.. ఎన్నికల బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే తన అఫిడవిట్‌తో రాజకీయ వర్గాల్లో మరో చర్చకు తెరలేపారు.


