కతిహార్: బిహార్‌లోని కతిహార్ జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అహద్‌గా అధికారులు గుర్తించారు.
కతిహార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) పరిచయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద ముఠాతో అహద్‌కు సంబంధాలు ఉన్నాయనే నిర్దిష్ట సమాచారం మేరకు భద్రతా సిబ్బంది సోమవారం అతడిని అదుపులోకి తీసుకుని, విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను సాంకేతికంగా విశ్లేషించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టి ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధమున్న రాణా హసీన్ అనే వ్యక్తితో నిందితుడు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు విచారణలో తేలింది.
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన చాటింగ్‌లు చేయడం, ఆడియో కాల్స్ మాట్లాడటం, దేశంలోని సున్నితమైన ప్రాంతాల సమాచారాన్ని చేరవేయడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో భారతదేశానికి వ్యతిరేకంగా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తూ, పాకిస్తాన్ వాట్సాప్ ఛానళ్ల లింకులను ఇతరులకు షేర్ చేస్తూ దేశంలో ఉగ్ర నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇతర కేంద్ర భద్రతా సంస్థల సహాయంతో విచారణ జరుపుతున్నారు.


