11 ఫ్లాప్‌లతో కెరీర్ క్లోజ్ అనుకున్న వేళ.. | How Prakash Mehra Made Amitabh Bachchan a Superstar | Sakshi
Sakshi News home page

11 ఫ్లాప్‌లతో కెరీర్ క్లోజ్ అనుకున్న వేళ..

Jul 14 2026 9:01 AM | Updated on Jul 14 2026 9:10 AM

How Prakash Mehra Made Amitabh Bachchan a Superstar

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అమితాబ్ బచ్చన్ పేరు ఒక ప్రభంజనం. అయితే ఒకానొక సమయంలో ఆయన కెరీర్  పతనావస్థకు చేరింది. వరుసగా 11 సినిమాలు ఫ్లాప్ కావడంతో ‘బిగ్ బీ’ నటనకే గుడ్ బై చెప్పాలనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో బాలీవుడ్ చిత్రాల గమనాన్ని, అమితాబ్ బచ్చన్ తలరాతను పూర్తిగా మార్చేస్తూ 1973లో ఒక సంచలన చిత్రం విడుదలైంది. అదే ‘జంజీర్’. ఈ సినిమా వెనుక ఉన్నది మరెవరో కాదు, హిందీ చిత్రసీమలో ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ యుగానికి నాంది పలికిన దిగ్గజ దర్శకుడు, నిర్మాత ప్రకాష్ మెహ్రా. రైల్వే స్టేషన్‌లో ఆకలితో పడుకున్న ఒక సామాన్యుడు, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన దర్శకుడిగా ఎలా ఎదిగారు అనేది నిజంగా ఒక సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తుంది.

వీధుల నుండి ముంబై కలల ప్రపంచానికి..
ప్రకాష్ మెహ్రా 1939 జూలై 13న ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్‌లో జన్మించారు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడం, తండ్రి సన్యాసం స్వీకరించి ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో ఆయన ఒంటరివారయ్యారు. మేనమామల దగ్గర పెరిగిన మెహ్రా, తన 13-14 ఏళ్ళ ప్రాయంలోనే కలల నగరం ముంబైకి పారిపోయి వచ్చారు. ముంబైలో బతకడానికి ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తలదాచుకోవడానికి చోటు లేక రైల్వే స్టేషన్‌లో ఆకలితో నిద్రపోయిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. పొట్టకూటి కోసం ఒక కటింగ్‌ షాప్‌లో పనిచేశారు. థియేటర్లలో ఫ్లోర్ క్లీన్ చేయడం, స్టేజ్ పై తెరలు లాగడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగించారు.

టీ బాయ్ నుండి స్టార్ డైరెక్టర్‌గా..
సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో ఎలాగోలా స్టూడియోలలో అడుగుపెట్టిన ప్రకాష్ మెహ్రా, మొదట్లో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు టీ అందించే చిన్న ఉద్యోగిగా చేరారు. అలా అందరికీ చాయ్ పోస్తూనే సినిమా మేకింగ్‌లోని మెళకువలను గమనించేవారు. క్రమంగా ప్రొడక్షన్ కంట్రోలర్‌గా మారి, ఆ తర్వాత దర్శకులకు అసిస్టెంట్‌గా చేరి మెగాఫోన్ పట్టే స్థాయికి ఎదిగారు. 1968లో శశి కపూర్ ద్విపాత్రాభినయంలో వచ్చిన ‘హసీనా మాన్ జాయేగీ’ సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. మొదటి ప్రయత్నమే మంచి విజయాన్ని సాధించడంతో పరిశ్రమలో ఆయన పేరు మారుమోగింది. ఆ తర్వాత ‘మేళా’ (1971), ధర్మేంద్రతో ‘సమాధి’, రాజేంద్ర కుమార్‌తో 'ఆన్ బాన్' వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు.

భార్య నగలు కుదువబెట్టి తీసిన ‘జంజీర్’
1973లో ప్రకాష్ మెహ్రా కెరీర్‌ను మాత్రమే కాకుండా, భారతీయ సినిమా రికార్డులను తిరగరాసిన ‘జంజీర్’ ప్రాజెక్ట్ మొదలైంది. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమయ్యాక దేవ్ ఆనంద్, ధర్మేంద్ర, రాజ్‌కుమార్ వంటి ఆనాటి టాప్ హీరోలందరికీ కథ వినిపించారు. కానీ రకరకాల కారణాల వల్ల వారంతా ఈ సినిమాను తిరస్కరించారు. దాంతో అప్పటికే వరుసగా 11 ఫ్లాపులతో సతమతమవుతున్న అమితాబ్ బచ్చన్‌ను హీరోగా పెట్టాలని మెహ్రా నిర్ణయించుకున్నారు. ఫ్లాప్ హీరోతో సినిమా చేయడానికి ఏ నిర్మాత ముందుకు రాకపోవడంతో, ప్రకాష్ మెహ్రా స్వయంగా తన భార్య నగలను తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చుకుని సినిమాను నిర్మించారు.

‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ ఉదయించాడిలా..
‘జంజీర్’ థియేటర్లలోకి వచ్చి ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతవరకు చాక్లెట్ బాయ్, రొమాంటిక్ పాత్రలకే పరిమితమైన హిందీ సినిమాలో, వ్యవస్థపై తిరగబడే ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అమితాబ్‌ను ప్రకాష్ మెహ్రా ఆవిష్కరించారు. ఈ సినిమాతోనే అమితాబ్ బచ్చన్‌కు ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ అనే బిరుదు వచ్చింది. అమితాబ్ కెరీర్ ఒక్కసారిగా తిరుగులేని టాప్ గేర్‌లోకి దూసుకెళ్లింది.

‘విజయ్’ అనే ఐకానిక్ పేరుతో..
అమితాబ్ బచ్చన్‌కు స్క్రీన్ మీద ‘విజయ్’ అనే పేరును మొదటిసారిగా పెట్టింది ప్రకాష్ మెహ్రానే. ‘జంజీర్’ లోని విజయ్ పాత్ర ఎంతగా పాపులర్ అయిందంటే, ఆ తర్వాత అమితాబ్ నటించిన దాదాపు 19 పైగా చిత్రాలలో ఇతర దర్శకులు కూడా ఆయన క్యారెక్టర్ పేరును ‘విజయ్’ గానే కొనసాగించారు. జంజీర్ విజయం తర్వాత ప్రకాష్ మెహ్రా-అమితాబ్ కాంబినేషన్ బాలీవుడ్‌కు ఒక సక్సెస్ ఫార్ములాగా మారింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన హేరా ఫేరి (1976), ముకద్దర్ కా సికందర్ (1978), లావారిస్ (1981), నమక్ హలాల్ (1982), షరాబీ (1984) వంటి చిత్రాలు నేటికీ కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి.

అంతర్జాతీయ కల.. ముగిసిన ప్రస్థానం
బాలీవుడ్‌ను శాసించిన ప్రకాష్ మెహ్రా హాలీవుడ్ ప్రముఖ నటుడు చార్లెస్ బ్రాన్సన్‌తో కలిసి ‘ది గాడ్ కనెక్షన్’ అనే అంతర్జాతీయ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేశారు. దీని కోసం భారీగా నిధులు కూడా సమకూరాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. కటింగ్‌ షాప్ వర్కర్ నుండి కోట్లాది మందిని అలరించిన దిగ్గజ దర్శకుడిగా ఎదిగిన ప్రకాష్ మెహ్రా 2009లో కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన సినిమాలు, అమితాబ్ బచ్చన్ రూపంలో అందించిన స్టార్‌డమ్ భారతీయ సినిమా ఉన్నంతవరకు సజీవంగానే ఉంటాయి.

ఇది కూడా చదవండి: సరస్సులు మాయం, రిజర్వాయర్లు ఖాళీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement